Vizag Steel Plant: శ్మశానంగా మార్చి మిజోరాం వెళ్లమంటారా? సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana: సంచలనాలకు కేరాఫ్ అయిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్రైవేటీకరణను వెంకయ్య ఒక్కరే ఆపగలరన్నారు. అలాగే విశాఖను శ్మశానంగా మార్చి మిజోరాం వెళ్లమంటే హరిబాబు ఎందుకు ఒప్పుకుంటున్నారని ప్రశ్నించారు.

 • Share this:
  CPI Narayana Comments:  స్టీల్ ప్లాంట్ ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. రాజకీయంగా ఉద్యమాన్ని పటిష్టం చేసే దిశగా కార్మిక సంఘాలు ముందుకు వెళ్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ మినహా అఖిలపక్ష పార్టీలు కేంద్రం తీరును నిరసిస్తూ తమ గళాన్ని వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మహా నగర పాలక సంస్థ జిహెచ్ఎంసి తీర్మానం చేసింది. కానీ తాజాగా కేంద్రం మరోమారు తన నిర్ణయాన్ని మార్చుకోబోమున్న విషయాన్ని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయానికి వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే టెండర్లు ఆహ్వానిస్తూ బిడ్డింగ్ ప్రారంభించారు. ఈ బిడ్ లకు సంబంధించిన అప్లికేషన్లను ఆన్ లైన్ లో అందుబాటులోకి కూడా వచ్చాయి. ఈ నెల 15వ తేదీన ప్రీ-బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఆపై 28వ తేదీన బిడ్ సమర్పణ చివరి తేదీగా నిర్ణయించారు. 29వ తేదీన సాంకేతిక బిడ్లను ప్రకటించనున్నారు. బిడ్ లలో పాల్గొనడానికి లక్ష రూపాయలు డిపాజిట్, కోటి రూపాయల ఆర్థిక సంస్థ హామీ ఇవ్వాలని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందులో ఎంపికైన కంపెనీకి తక్షణమే స్టీల్ ప్లాంట్ ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దూకుడుతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

  ఉద్యమానికి మద్దుతుగా నిలుస్తున్న సీపీఐజాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తీవ్రంగా స్పందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుగోల సామర్థ్యం కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి మాత్రమే ఉందన్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుదని నమ్మలేమన్నారు. అందుకే ప్రైవేటీరణను అడ్డుకోవడానికి వెంకయ్యనాయుడు బాధ్యత తీసుకోవాలని నారాయణ కోరారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థిగా విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమంలో పాల్గొన్న వెంకయ్య మరోసారి దీనిపై నోరు విప్పాలన్నారు.

  ఇదీ చదవండి: ఎంపీ రఘురామపై అనర్హత వేటు లేనట్టేనా..? లోక్ సభ స్పీకర్ తీరుపై వైసీపీ అసహనం

  కొత్తగా మిజోరాం గవర్నర్ గా ఎన్నికైన హరిబాబుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. ఏపీ ప్రభుత్వం ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటే తప్ప ఉత్తరాలతో ప్రయోజనమేమీ ఉండదన్నారు. స్టీల్ ప్లాంట్ లేని విశాఖ ని రాజధాని చేస్తే బోడి గుండుకు మల్లెపూలు చుట్టినట్టే ఉంటుందని తనదైన శైలిలో కామెంట్స్ చేశారు నారాయణ. స్టీల్ ప్లాంట్‌పై కోర్టుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ప్రజా పోరాటాలకు, ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్న హరిబాబుకు విశాఖపట్టణంపై ప్రేమ ఉంటే మిజోరాం గవర్నర్‌గా వెళ్లనని చెప్పాలన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంటేనే వెళతానని, లేకపోతే వెళ్లనని చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలోనే పుట్టి పెరిగి, రాజకీయంగా ఎదిగిన ఆయన.. విశాఖను శ్మశానంగా చేసి తనను మిజోరాం గవర్నర్‌గా వెళ్లమంటే ఎలా వెళతానని ఎందుకు చెప్పలేకపోతున్నారని నారాయణ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం లో కేంద్రంలో అధికారపార్టీలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ముద్దాయిలుగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు.

  ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వం తీరు చట్ట వ్యతిరేకం.. జలశక్తి మంత్రికి వైసీపీ ఫిర్యాదు
  Published by:Nagesh Paina
  First published: