హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తిరుమల శ్రీవారికీ తప్పదని కరోనా తిప్పలు.. నిత్య సేవలకు ఇబ్బందులు?

తిరుమల శ్రీవారికీ తప్పదని కరోనా తిప్పలు.. నిత్య సేవలకు ఇబ్బందులు?

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే.. తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతిని మరోసారి రద్దు చేసే అవకాశముంది.

(బాలకృష్ణ, న్యూస్ 18 ప్రతినిధి)

శ్రీవారు కొలువైయున్న ఏడు కొండలపై కరోనా విజృంభిస్తోంది. టీటీడీ సిబ్బందితో పాటు స్వామి వారికి కైంకర్యాలు నిర్వహించే జీయంగార్లు, అర్చకులకు కూడా కరోనా సోకింది. ఈ క్రమంలో తిరుమల ఆలయంలో పనిచేసే అర్చకుల సంఖ్యను కుదిస్తూ టీటీడీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోవిందరాజ స్వామి ఆలయం నుండి ఐదుగురిని తిరుమలకు కేటాయించింది టిటిడి. మరి కొందరిని అర్చకులను డిప్యూటేషన్‌పై తిరుమలకు కేటాయించాలని టిటిడి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొండపై అర్చకులతో పాటు, టిటిడి ఉద్యోగుల్లోనూ కరోనా భయం పట్టుకుంది..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీశ్రీనివాసుడు కొలువైయున్న సప్తగిరులు నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోగుతుంటాయి. ఆపద మొక్కుల వాడి దర్శన భాగ్యం కోసం కిలో‌మీటర్లు నడుచుకుంటూ స్వామి సన్నిధికి చేరుకుంటారు భక్తులు. స్వామి నామాన్ని స్మరిస్తే చాలు ఎంతటి కష్టామైనా పఠాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీవారి ఆలయంలో మూలమూర్తుకి నాలుగు వంశాల అర్చకులే నిత్య ఉపచారాలు, కైంకర్యాలు నిర్వహించాలని శ్రీ వైఖానస భగత్ శాస్త్రం చెబుతోంది. గొల్లపల్లి, పెద్దింటి, పైడిపల్లి, తిరుపతమ్మ వంశీకులు శ్రీవారి ఆలయ మిరాశీ అర్చకులుగా సేవలందిస్తున్నారు. వేకువజాము సుప్రభాతంతో శ్రీశ్రీనివాసుని మేలుకొలుపు సేవ మొదలుకొని, నిత్య కైంకర్యాలు రాత్రి శ్రీవారికి జరిపే పవళింపుసేవ అయిన ఏకాంత సేవ వరకూ ఎటువంటి లోటు‌ లేకుండా వైఖనసా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు అర్చక స్వాములు. అలాంటిది ప్రతినిత్యం లక్షలాది మంది సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం‌ కోసం వేచి ఉన్నా స్వామి జరగాల్సిన కైంకర్యాలు, నైవేద్యాలు సమర్పించిన‌ తరువాతే భక్తులకు అనుమతిస్తారు అర్చకులు.

ప్రతి రోజు 50 మంది మిరాశీ అర్చకులు స్వామి వారి సేవలో తరిస్తారు. బ్రహ్మ ముహూర్తంకు 56 మినిషాలకు ముందుగా స్వామి వారికి సుప్రభాత సేవను ప్రారంభిస్తారు. సుప్రభాత సేవలో సన్నిధి గోళ్లతో పాటుగా నలుగురు మిరాశీ అర్చకులు స్వామి వారికి నిత్య ఉపచారా సేవలు అందిస్తారు. సుప్రభాతం, శుద్ధి, ప్రాతఃకాలారాధన, తోమాల, కొలువు (ఆస్థానం), సహస్రనామార్చన, మొదటి గంట వరకు నలుగురు అర్చకులు సేవలు అందిస్తారు. ప్రత్యేకంగా శుక్రవారం నాడు మాత్రం శ్రీనివాసునికి అభిషేకం నిర్వహణ ఉంటుంది కాబట్టి నలుగురు మిరాశీ అర్చకులు, ఒక ప్రధాన అర్చకులు స్వామి వారి కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇలా ప్రతి నాలుగు గంటలకు ఒక సారి షిఫ్టుల మార్చుకుంటూ ఉంటారు. మధ్యాహ్నిక నివేదన (రెండవ గంట) అనంతరం గర్భాలయంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఇద్దరు అర్చకులు బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి ఆలయ విమాన ప్రదక్షిణముగా ఆలయంలోని సంపాంగి ప్రకారంలో దక్షిణ భాగంలో గల కల్యాణోత్సవ మండపంలోకి తీసుకెళ్తారు. లోక కళ్యాణార్థం నిర్వహించే కళ్యాణోత్సవంను ఆరుగురు అర్చకులు నిర్వహిస్తారు. హోమము, బలి, శాత్తుమోర్ర, శుద్ధి, మధ్యకాలారాధన, అష్టోత్తర శతనామార్చన, రెండవ గంట, శుద్ధి, సాయం కాల ఆరాధన, తోమాల, అష్టోత్తర శతనామార్చన, నివేదన(గంట సమయం), ఏకాంత సేవ, గురువారం విశేషంగా చేపట్టే పూలంగి సేవ వరకు అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు. ఇక మలయప్ప స్వామి వారికి జరిగే ఆర్జితంసేవలను మిరాశీ అర్చకులే నిర్వహిస్తారు. స్వామి వారికి ఏ సేవ చేయాలన్న నాలుగు వంశాల అర్చకుల చేతుల మీదుగానే జరగాలని ఆగమ శాస్త్ర నియమం. వీటిని పర్యవేక్షించడానికే శ్రీ మథ్ రామానుజ చర్యల వంశీకులను పెద్ద జీయర్, చిన్న జీయర్ స్వాములు ఉన్నారు. వీరి స్వహస్తాల మీదుగా స్వామి వారి కైంకర్యాలు నిర్వహించాల్సి ఉంటుంది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీశ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారికి నిర్వహించే కళ్యాలోత్సవం మినహా మిగిలిన ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. స్వామి వారికి నిర్వహించే కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. కరోనా కాటు వేస్తున్నా శ్రీవేంకటేశ్వరుని కైంకర్యాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఐతే చాపకింద నీరులా మిరాశీ అర్చకుల‌ను కూడా కరోనా మహమ్మారి తాకింది. ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకులలో కొందరికి కరోనా లక్షణాలు ఉండటంతో టీటీడీ అధికారులు అర్చకులకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 18 మంది అర్చకులకు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. వ్యాధి నిర్ధారణ అయిన అర్చకులలో చికిత్స పొంది ముగ్గురు డిశ్చార్జి అయ్యారు. మరో అర్చకుడి పరిస్థితి విషయంగా ఉండడంతో చెన్నైలోని అపోలో అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది టిటిడి.

స్వామి వారికి అన్ని తామై చూసుకునే అర్చకులను సైతం కరోనా మహమ్మారి వదలక పోవడం టిటిడినే కాదు అర్చకులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసిందని చెప్పవచ్చు. నిత్య కైంకర్యాలలో పాల్గొనే అర్చకుల సంఖ్య సగంకు కుదించి విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. శుక్రవారం అభిషేకం రోజు మాత్రం 5 మంది మిరాశీ అర్చకులు గర్భాలయంలో విధులు నిర్వహించే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్యాణోత్సవంలోను కనీసం ఐదుగురు అర్చకులు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన సమయాల్లో ఇద్దరు అర్చకులు మాత్రమే స్వామి వారి కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నారు. రోజుకు 50 మంది అర్చకులు విధులు నిర్వహించేవారు. కరోనా సోకిన అర్చకులతో పాటుగా వయో పతిమితి అధికంగా ఉన్న అర్చకులు కొందరు సెలవు పెట్టడంతో ఇప్పుడు 25మంది అర్చకులు శ్రీవారి సన్నిధిలో సేవలందిస్తున్నారు

శ్రీవేంకటేశ్వరుని కైంకర్యాలు నిర్వహించే అర్చకులు కరోనా భారిన పడటంతో మిరాశీ అర్చకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అర్చకుల సంక్షేమంకు కావాల్సిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ప్రతి ఒక్క అర్చకుడికి ప్రత్యేకంగా ఓ గదిని సైతం ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందించేందుకు టిటిడి చర్యలు తీసుకుంది. తాజాగా తిరుపతి మొత్తం కంటైన్మెంట్ జోన్ లోకి రావడంతో తాత్కాలికంగా శ్రీవారి సర్వదర్శనం (ఎస్ఎస్ డి) టైం స్లాట్ టోకెన్లను రద్దు చేశారు. 14 రోజుల పాటు దర్శన టోకెన్స్‌ను నిలుపుదల చేస్తూ.. తదుపరి ఆదేశాల వరకు దర్శన టోకెన్స్ ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం రోజుకు 10 వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పిస్తుంటే.. అందులో 40 శాతం మంది తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. టిక్కెట్లు పొందిన సమయంలో వారి గ్రీన్ జోన్‌లో ఉండటం, తీరా దర్శన సమయం వచ్చేలోపు కంటైన్మెంట్ జోన్ పరోధిలోకి రావడంతో శ్రీవారి దర్శనాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

తిరుపతితో పాటుగా తిరుమలలోను కరోనా కేసులు నమోదు కావాడంతో ఇటు టీటీడీలో పనిచేసే ఉద్యోగులు.. అటు అర్చకులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇదే క్రమంలో స్వామి వారి కైంకర్యాలు నిర్వహించాలంటే అర్చకులు తప్పని సరి. వారి స్ధానంలో మరొకరితో కైంకర్యాలు నిర్వహించలేరు. అటువంటిది అర్చకుల ఆరోగ్య దృష్ట్యా స్వామి దర్శనాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా రద్దు చేయాలని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏవి రమణ‌ దీక్షితులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ట్విటర్‌లో ట్యాగ్ చేస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసారు. అధికారుల నిర్లక్ష్యం దోరణి కారణంగా 18 మంది అర్చకులు కరోనా భారిన‌ పడ్డారని, అర్చకుల యోగక్షేమాలు చూడాల్సిన భాధ్యత టిటిడి అధికారులపై ఉందని సంచనన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో‌ అంత కంతకు కరోనా కేసులు నమోదు కావడంతో దర్శనాల నిలుపుదలపై రాష్ట్ర ప్రభుత్వంకు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే.. తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతిని మరోమారు రద్దు చేసే అవకాశముంది.

First published:

Tags: Coronavirus, Covid-19, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Tirupati

ఉత్తమ కథలు