అన్లాక్ 1 తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ.. భక్తులకు దర్శనాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు టీటీడీ సిబ్బంది సైతం కరోనా బారినపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు.

నిత్యం 200 మంది టీటీడీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 80 మందికి పాజిటివ్ వచ్చింది. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్ సోకినట్లు ఆధారాల్లేవు. ఇప్పటి వరకు 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది.
— భరత్ గుప్తా
కాగా, చిత్తూరు జిల్లాలో 1,765 మంది కరోనా బారినపడ్డారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం వరకు 22,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,101 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 264 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 10,894 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 10,77,733 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by:Shiva Kumar Addula
First published:July 09, 2020, 07:21 IST