P Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) ఉధృతంగా ఉంది. చూస్తుండగానే రోజువారీ కేసుల సంఖ్య 10వేలు దాటేసింది. ముఖ్యంగా విశాఖపట్నం లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజివిటిటీ రేటు రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఏకంగా 1,827 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో కొవిడ్ వైరస్...మరోసారి సామాజిక వ్యాప్తి దశకు చేరినట్టు వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణంగా కొవిడ్ వైరస్ వ్యాప్తిని నాలుగు దశలుగా పేర్కొంటారు. మొదటి దశలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ను గుర్తిస్తారు. రెండో దశలో ప్రాంతీయ స్థాయిలో కేసులు నమోదవుతాయి. కానీ ఈ కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసిన వారిలో మాత్రమే గుర్తించబడతాయి. మూడో దశను సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్మిషన్)గా పేర్కొంటారు. ఈ దశలో వైరస్ ఎవరి నుంచి ఎవరికి వ్యాప్తి చెందుతుందో, ఒకరికి వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. చివరిగా నాలుగో దశలో ప్రాంతీయ స్థాయిలో అత్యధికులు వైరస్ బారినపడే స్థాయికి చేరుతుంది.
విశాఖపట్నంజిల్లాలో గత 19 రోజుల్లో 10,098 కేసులు నమోదయ్యాయి. గత ఐదు రోజులుగా వెయ్యి దాటుతున్నాయి. 15న 1,103, 16న 1,028, 17న 1,018, 18న 1,263 కేసులు నమోదుకాగా బుధవారం ఏకంగా 1,827 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,69,013కు చేరింది. ఇందులో 1,58,728 మంది కోలుకోగా, మరో 9,137 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలో కొద్దిరోజులుగా కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ మరణాలు లేకపోవడం కొంత ఉపశమనంగా భావిస్తూ వచ్చారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఇద్దరు మృతిచెందారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,148కు చేరింది. ప్రస్తుతం కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్లో 170 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిలో అత్యధిక శాతం హోం ఐసోలేషన్లో వున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు.
జిల్లాలో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు భారీగా పెరగడానికి ప్రజలు వ్యవహార శైలే కారణమని వైద్యులు, అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పండగ సీజన్లో వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు భారీగా తరలిరావడం, భౌతికదూరం పాటించకపోవడం, మాస్క్ వాడకపోవడం, శానిటైజర్లు వినియోగించకపోవడం వల్ల కేసులు భారీగా పెరుగుతున్నాయని అంటున్నారు. రానున్న పది రోజుల్లో కేసులు మరింత భారీగా పెరిగే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొవిడ్ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నారు.
అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. ముగ్గురు వైద్యులు, మరో వైద్య అధికారి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు నాలుగో తరగతి సిబ్బందితో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లకు పాజిటివ్ వచ్చింది. సోమవారం 54 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 11 మంది వైద్యులు, సిబ్బంది ఉన్నారన్నారు. ప్రస్తుతం అంతా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొవిడ్ బారినపడ్డారు. ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్, మరో డాక్టర్, ఇద్దరు నర్సింగ్ స్టాఫ్కు కరోనా నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Corona cases, Visakhapatnam