news18-telugu
Updated: January 10, 2019, 6:11 PM IST
వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి వెళ్లిన ఏపీ విపక్ష నేత...సామాన్య భక్తుడిలానే వెంకన్న గుడిలోకి వెళ్లారు. ఐతే జగన్‌కు స్వాగతం పలికే సమయంలో వేదపండితులు అనుసరించిన తీరుపై వివాదం రాజుకుంది. జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారని.. కానీ మీడియాను చూసి పక్కనబెట్టారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేద పాఠశాల నుంచి పండితులు వెళ్లడంపైనా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆలయ నియమనిబంధనలను ఉల్లంఘించారని పలు హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు.
పూర్ణకుంభంతో ఎవరికి స్వాగతం పలకాలి?ఆలయ దర్శనానికి వెళ్లిన ప్రముఖులకు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం చూస్తుంటాం. ఐతే ఎవరెవరికి పూర్ణం కుంభంతో స్వాగతం పలుకుతారో తెలుసా? దేవాలయాల్లో ఎవరికి పడితే వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకకూడదు. కేవలం మఠాధిపతులు, దేశాధిపతులు, రాష్ట్రాధిపతులతో పాటు వేదవేదాంత పండితులు, మహా పురుషులకు మాత్రమే స్వాగతం పలకాలని పండితులు చెబుతున్నారు. పూర్ణకుంభాన్ని సకల జగత్తునకు ప్రతీకగా భావిస్తారని.. స్వాగతం అనంతరం ఆ పూర్ణకుంభాన్ని వేమంత్రాలతో అభిమంత్రించి అనంతరం ప్రోక్షణం చేస్తారని వెల్లడించారు. జగన్ రాష్ట్రాధినేత కాదని..అలాంటప్పుడు పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు ఎలా ఏర్పాట్లు చేస్తారంటూ విమర్శలు వస్తున్నాయి.
వైఎస్ జగన్ గతంలో తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు కూడా వివాదాలు రాజుకున్నాయి. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు గత ఏడాది నవంబరు 5న తిరుమల క్షేత్రానికి వెళ్లారు. జగన్ వెంట వచ్చిన వైసీపీ నేతలను తనిఖీ చేయకుండానే ఎస్పీఎఫ్ సిబ్బంది లోనికి పంపించారు. జగన్ వెంట వచ్చిన వారిలో కొందరు క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులతో వచ్చారని విమర్శలు వచ్చాయి. ఓ మహిళా నేత చెప్పులతో వెళ్లగా..భద్రతా సిబ్బంది వారించారని, దాంతో ఆమె అక్కడే చెప్పులు వదిలేశారంటూ దుమారం చెలరేగింది. అంతకుముందు కూడా జగన్ తిరుమల పర్యటనపై వివాదం రాజుకుంది. జగన్ క్రిస్టియన్. అన్యమతస్తులు తిరుమల కొండకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ జగన్ క్రిస్టియన్ ఐనప్పటికీ సంతకం చేయలేదని అప్పట్లో విమర్శలు వినిపించాయి.
First published:
January 10, 2019, 6:04 PM IST