తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వెటరన్ కొణిజేటి రోశయ్య(89) ఇక లేరు. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శనివారం నాడు హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారు. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోగా, కుటుంబీకులు హుటాహుటి ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. రోషయ్య మరణాన్ని వైద్యులు సైతం ధృవీకరించారు. స్వాతంత్ర్య సమరంలోనూ పాల్గొన్న రోశయ్య.. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చాణక్యుడిగానే కాకుండా చతురుడిగానే పేరుపొందిన రోశయ్య మరణంతో కాంగ్రెస్ పార్టీ విషాదంలోకి వెళ్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోశయ్య అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఈ వార్త విని షాకయ్యారు. రోశయ్య మరణంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ సాకె శైలజానాథ్ లు సంతాప ప్రకకటలు చేశారు.
గాంధీ భవన్‌కు రోషయ్య పార్థివదేహం
మాజీ సీఎం రోశయ్య మరణవార్త తెలియగానే పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. రోశయ్య కుమారుడితో రేవంత్ ఫోన్ లో మాట్లాడారు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే రోశయ్య నివాసానికి వెళ్లనున్నారు. రోశయ్య పార్థివదేహాన్ని సందర్శించేందుకు ఆయన ఇంటికి నేతలు క్యూకట్టారు. రోషయ్య అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించాలా లేక ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించాలా అనేది ఇంకాసేపట్లో ఖరారు కానుంది. రోశయ్య సుదీర్ఘ రాజకీయ జీవితం గడిచిన హైదరాబాద్ లోనే అంత్యక్రియలు జరగొచ్చని తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం రోశయ్య మృతదేహాన్ని పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ కు తరలించనున్నారు.
15సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు..
‘జీవించినంత కాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. రాజకీయాలలో విలువలు, నిబద్ధతకు ఆయన మారుపేరు. ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రికార్డు కూడా రోశయ్యగారి సొంతం. ఎమ్మెల్సీగా తొలి సారి చట్టసభలోకి నేను వచ్చినప్పుడు రోశయ్య గారితో దగ్గర పరిచయం ఏర్పడింది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో ఆయన నాకు సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవారు. ఆయనలో నాపై ప్రత్యేక అభిమానం కనిపించేది. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకున్న సందర్భంలో అనేక విలువైన సూచనలు చేశారు. అలాంటి మంచి నాయకుడు మన మధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి, సమాజానికి కూడా తీరని లోటు. వ్యక్తిగతంగా కూడా ఆయన లేనిలోటు తీర్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.
రాజకీయాల్లో అజాత శత్రువు..
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రోశయ్య ఆత్మకు సద్గతులు కలగాలని, ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. రోశయ్య మరణంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని కోల్పోయామని శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అజాత శత్రువుగా రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడని శైలజానాథ్ కొనియాడారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారన్నారు. వివాదరహితుడిగా నిలిచారని తెలిపారు. తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు. సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగి తన సేవలనందించారన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Congress, Congress, Revanth Reddy, Rosaiah, Tpcc