ఏపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. జీవో నెంబర్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు చివరకు తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న పిటీషనర్ తరపు వాదనలు అలాగే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలను వినిపించారు. నేడు మరోసారి ఇద్దరి వాదనలతో పాటు బీజేపీ, జనసేన పిటీషన్లపై కూడా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జీవో నెంబర్ 1పై విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెకేషన్ బెంచ్ డీఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించింది. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ పరిధిని మించి వ్యవహరించిందన్నారు. ప్రతీ కేసు ముఖ్యమైంది అంటూ వెళితే హైకోర్టు ఏమై పోవాలని వ్యాఖ్యానించింది. ఇలాంటివి జరిగితే ప్రతీ వెకేషన్ జడ్జి చీఫ్ జస్టిస్ అయిపోయినట్టే. కేసు మూవెళ్లి చూస్తే ఈ కేసు అంత ఎమర్జెన్సీ కూడా అనిపించలేదు. కేసు గురించి దాని మూలాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నానని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. నాకేమి తెలియదు అనుకోవద్దు. రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు నివేదించింది.
హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నా అధికారాలను ఉపయోగిస్తానని చీఫ్ జస్టిస్ అన్నారు. నా పిటీషన్ స్వీకరించాలంటూ వెకేషన్ కోర్టు ముందు ధర్నా ఏమైనా జరిగిందా అంటూ చీఫ్ ప్రశ్నించారు. అంత అర్జెంట్ గా వెకేషన్ బెంచ్ లో లంచ్ మోషన్ ఎందుకు వేశారంటూ ప్రశ్నించారు. ఎలాంటి ఎమర్జెన్సీ లేనప్పుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరం ఏంటని అభిప్రాయపడ్డారు. నాకేమి తెలియదు అనుకుంటే పొరపాటే. ప్రతీ విషయం నాకు తెలుసు అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోను వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు (Ap High Court) ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి నిరాకరిస్తూ ఈ కేసు హైకోర్టులో ఉన్నందున జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఈ కేసును హైకోర్టు జస్టిస్ విచారణ జరపాలని ఆదేశించింది.
దీనితో నిన్న, నేడు హైకోర్టు (Ap High Court) విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP High Court, AP News