16 నెలల్లో పోలవరం పూర్తవుతుందా? సీఎం జగన్ ఎందుకా టార్గెట్ పెట్టారు?

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైంది కానీ... ఏపీలో పోలవరం మాత్రం పూర్తి కాలేదు. మరి కొత్త ప్రభుత్వం డెడ్‌లైన్ వర్కవుట్ అవుతుందా? అసలు సమస్యేంటి?

 • Share this:
  Andhra Pradesh : తెలంగాణ సీఎం కేసీఆర్ లాగా... ఏపీ సీఎం జగన్ కూడా... నీటిపారుదల రంగంపై దృష్టిసారిస్తున్నారు. అందులో భాగంగా... ఏళ్లుగా పూర్తికాని పోలవరం ప్రాజెక్టును జస్ట్ 16 నెలల్లో పూర్తి చేయాలనీ... 2021 జూన్ నాటికి... పోలవరం గుండా... గోదావరి ప్రవాహం సాగాలని అధికారులకు డెడ్‌లైన్ పెట్టారు. ఇది వినడానికి ఎంతో హాయిగా అనిపించే మాట. కానీ... ఇంత తక్కువ కాలంలో పోలవరం పూర్తవుతుందా అన్నదే తేలాల్సిన అంశం. అసలు సమస్యంతా... నిధుల దగ్గరే వస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సినన్ని నిధులు ఇవ్వట్లేదన్నది మొదటి నుంచీ వినిపిస్తున్న మాట. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ఫలితం కనిపించట్లేదన్నది ప్రభుత్వ భావన. కానీ సీఎం జగన్... ఏదైనా చెబితే... అది అచ్చుగుద్దినట్లు అట్లాగే జరగాలని పట్టుపడుతుంటారు. పోలవరం విషయంలో 16 నెలల్లో పూర్తి చేయడానికి సాధ్యం అవుతుంది కాబట్టే... ఆయన ఆ డెడ్‌లైన్ విధించారు. ఆల్రెడీ ప్రాజెక్టును సందర్శించి, పరిశీలించిన సీఎంకి... ఓ క్లారిటీ వచ్చింది. పక్కా ప్లాన్ వేసుకుంటే... వచ్చే సంవత్సరం వర్షాకాలం రాకముందే దాన్ని పూర్తి చేయవచ్చని అనుకున్నారు. అలా జరగాలంటే ముందు ఈ సంవత్సరం జూన్‌ నాటికి (మరో 4 నెలల్లో) స్పిల్‌వే నిర్మాణం పూర్తి కావాలి. అలాగే... కాఫర్‌ డ్యాంలో ఖాళీలు పూర్తి చెయ్యాలి. నది ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించి ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాంను పూర్తిచేయాలి. అంటే ఒకే సమయంలో... స్పిల్‌వే, కాఫర్‌ డ్యాం నిర్మాణాలు కూడా పూర్తవ్వాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా పూర్తికాని ప్రాజెక్టును... 16 నెలల్లో పూర్తి చేయగలిగితే... అది గొప్ప విషయమే అవుతుంది.

  పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత దృశ్యం


  ప్రభుత్వం ముందు మరో సమస్య కూడా ఉంది. అదే నిర్వాసితుల తరలింపు. కాఫర్ డ్యాం పూర్తైతే... గోదావరిలో నీటి మట్టం 41 మీటర్లకు చేరుతుంది. అంత ఎత్తుకు నీరు చేరితే... గోదావరి చుట్టూ... 17000కు పైగా కుటుంబాల్ని ఇతర ప్రాంతాలకు తరలించాలి. అంటే వాళ్లకు పునరావాసం కల్పించాలి. అందుకోసం R అండ్ R ప్యాకేజీ ప్రకటించాలి. అందుకు రూ.5000 కోట్లు అవసరం అని అంచనా. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రూ.200 కోట్లు ఇస్తామంది. అలాగే... పునరావాస కాలనీల నిర్మాణాలకు కూడా మనీ ఇస్తామని చెప్పింది. ఐతే... ఈ 16 నెలల డెడ్‌లైన్‌లోనే ఇదీ పూర్తికావాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ప్రాజెక్టు పురోగతిపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూ ఉండాలి. అందుకోసం ఓ అధికారిని నియమించుకోవాలి. ఆ అధికారి... కేంద్రం నుంచీ పూర్తి సహకారం అందేలా చెయ్యాలి. ఇవన్నీ ప్రభుత్వం ముందున్న సవాళ్లు. అధికారులకు పూర్తి భరోసా ఇచ్చిన సీఎం... "డోంట్ వర్రీ... గో ఎహెడ్" అన్నారు.

  పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత దృశ్యం


  సీఎం జగన్... ముఖ్యమంత్రి అయ్యాక... ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా... ఇది అద్భుత విజయం అని చెప్పుకోవడానికి కొన్నే కనిపిస్తున్నాయి. చాలా వరకూ పథకాల రూపంలోనే అమలవుతున్నాయి. ఇంతవరకూ భారీ ప్రాజెక్టేదీ జగన్ ప్రారంభించలేదు. పోలవరం గనక పూర్తైతే... ఈ ప్రాజెక్టు వైసీపీకి మరింత బలాన్ని చేకూర్చే అవకాశాలున్నాయి. అందుకోసమే జగన్ దీనిపై దృష్టిసారిస్తున్నారు. 16 నెలల్లో పూర్తికాకపోతే... ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనీ.. గత టీడీపీ ప్రభుత్వం లాగే... వైసీపీ కూడా పోలవరం విషయంలో నిర్లక్ష్యం చూపిస్తోందనే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనే జగన్... చాలా తక్కువ టైమే ఇచ్చారు. మరి అధికారులు ఆ వేగాన్ని అందుకుంటారో లేదో త్వరలో మనకే తెలిసిపోతుంది.
  Published by:Krishna Kumar N
  First published: