rటాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి రాజకీయాల్లో రాణించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయాన్ని అలీ ఎప్పుడూ దాచుకోలేదు కూడా. గత ఎన్నికలకు ముందు జనసేన లేదా టీడీపీలోకి అలీ వెళతారని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్‌తో పాటు చంద్రబాబుతోనూ అలీ సమావేశమయ్యారు. అయితే ఈ రెండు పార్టీలను కాదని వైసీపీ కండువా కప్పుకున్నారు అలీ. దీంతో అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు అలీని టార్గెట్ చేశారు. అలీ కూడా వారికి కౌంటర్ ఇచ్చారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ కూడా కొంతకాలం పాటు అలీ దూరయ్యారు. ఆ తరువాత మళ్లీ ఇటీవల అలీ పవన్ కళ్యాణ్‌ను కలిశారని సమాచారం. చాలాకాలం తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్‌ను కలవడం సంతోషంగా ఉందని అలీ కామెంట్ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా అలీ మళ్లీ తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఇద్దరు మైనార్టీలకు అవకాశం ఇచ్చింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇక్బాల్‌తోపాటు విజయవాడకు చెందిన కరీమున్నీసాకు ఛాన్స్ అవకాశం కల్పించింది. దీంతో వైసీపీ నాయకత్వం మళ్లీ అలీని పక్కనపెట్టినట్టు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అలీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడంతో.. వైసీపీ నాయకత్వం నుంచి ఆయనకు పిలుపు వచ్చిందా అనే చర్చ జరుగుతోంది. పార్టీలో చేరినప్పటి నుంచి అలీకి మంచి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.
వైఎస్ జగన్‌ను కలిసిన కమెడియన్ అలీ (ys jagan ali)
అయితే రెండేళ్లు గడుస్తున్న ఆయనకు మాత్రం పదవి రాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి అలీకి ఏదైనా పదవి విషయంలో సీఎం జగన్ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన హామీ ఇస్తారా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆలీకి మైనార్టీ కార్పొరేషన్ లేదా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినీ రంగం నుంచి వైసీపీలోకి వచ్చిన వారిలో కమెడియన్ పృథ్వీకి మాత్రమే నామినేటెడ్ పోస్టు దక్కింది. ఆ తరువాత ఆయన కూడా వివిధ కారణాల వల్ల ఆ పదవిని కోల్పోయారు. దీంతో అలీకి ఈసారైనా సీఎం జగన్ నుంచి పదవి విషయంలో స్పష్టమైన హామీ వస్తుందా ? అన్నది చూడాలి.