CM YS JAGAN WANTS YSRCP MP VIJAYA SAI REDDY IN AP CABINET AS FINANCE MINISTER AMID CABINET RESHUFFLLE SAYS MEDIA REPORTS MKS
Cabinet Reshuffle: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం! -ఏపీ ఆర్థిక మంత్రిగా విజయసాయిరెడ్డి?
సీఎం జగన్ తో ఎంపీ సాయిరెడ్డి(పాత ఫొటో)
వైసీపీలో నంబర్.2 విజయసాయిరెడ్డి ఢిల్లీ వ్యవహారాల నుంచి రిలీవ్ అయి, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారా? గతంలో తనకు చాటర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన విజయసాయినే సీఎం జగన్ ఆర్థికమంత్రిగా కోరుకుంటున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? ప్రాబబుల్స్ జాబితాలో ఎమ్మెల్యేలకు ఎంపీలు సైతం పోటీకి వస్తున్నారా? వైసీపీలో నంబర్.2 విజయసాయిరెడ్డి ఢిల్లీ వ్యవహారాల నుంచి రిలీవ్ అయి, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారా? గతంలో తనకు చాటర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన విజయసాయినే సీఎం జగన్ ఆర్థికమంత్రిగా కోరుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోందంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక సంచలన కథనాన్ని రాసింది. నేడో రేపో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నిర్ణయం వెలువడనున్న క్రమంలో ఈ అంశం చర్చనీయాంశమైంది.
ఆర్థికమంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆ పదవిపై ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోందని, బుగ్గనను తొలగిస్తే ఆయన స్థానం శిల్పా చక్రపాణిరెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతున్న తరుణంలో బుగ్గన మాత్రమే ఆ శాఖను నిర్వహించడమే కాకుండా.. ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడి నిధులు సమీకరించే అవకాశం ఉంటుందని చెబుతున్నారని, అదే సమయంలో ఏపీ కేబినెట్ లోకి సాయిరెడ్డి ఎంట్రీపైనా చర్చ జరుగుతోందని కథనంలో పేర్కొన్నారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అధినేత వైఎస్ జగన్ పార్టీ పనిని, అనుబంధ సంఘాలకు ఇన్చార్జీ పనులను కట్టబెట్టారని, అయితే ఇప్పుడు సాయిరెడ్డిని తాడేపల్లిలోనే ఉండాలని సీఎం కోరారని, మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన దరిమిలా పార్టీ వ్యవహారాలు పూర్తిగా విజయసాయికి అప్పగించాలని జగన్ భావిస్తున్నారని తెలిపారు. సాయిరెడ్డికి రాజ్యసభ ఇవ్వని పక్షంలో ఎమ్మెల్సీని చేసి ఆర్థిక మంత్రిగా తీసుకుంటారని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోందని, ఒకవేళ విజయసాయి కేబినెట్లోకి తీసుకుంటే బుగ్గనకు ఉద్వాసన పలకడం ఖాయమని చెబుతున్నారని పేర్కొన్నారు.
ఏపీ కేబినెట్లో సీఎం జగన్‌తో కలిపి మొత్తం 25 మంది మంత్రులున్నారు. ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలుపుకుంటే 26 మంది అవుతారు. ఇందులో ఆరుగురు ఎస్సీలు, ఆరుగురు బీసీలు, ఎస్టీ ఒకరు, మైనార్టీ ఒకరు ఉన్నారు. 12 మంది ఓసీలు మంత్రులుగా ఉన్నారు. మళ్లీ అదే కాంబినేషన్లో మంత్రివర్గ కూర్పు ఉండాలని, అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంఖ్యలను పెంచి ఓసీలను తగ్గిస్తే ఎలా ఉంటుందనే దానిపై కేబినెట్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం కూడా ఇదే ప్రతిపాదనపై మొగ్గుచూపుతున్నారని, ఇప్పటికే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న కాపులకు ప్రాధాన్యత ఇచ్చే అంశంపైనా చర్చ సాగుతోందని కథనంలో రాశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.