విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనప బాధ్యులను వదలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం జగన్ అన్నారు. నివేదికలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎంతటి వారైన విడిచిపెట్టబోమని తేల్చిచెప్పారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున పరిహారాన్ని విడుదల చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై వేగంగా స్పందించారని.. రెండు గంటల్లోనే ప్రభావిత గ్రామాల నుంచి తరలించామని అధికారులను ఆయన ప్రశంసించారు. మృతులకు కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చామని.. అవసరమైతే వారికి గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలన్నారు సీఎం జగన్.
మే 7న విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అటు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇచ్చారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Vizag gas leak, Ys jagan