కృష్ణా కరకట్ట ప్రజలకు కొత్త ఇళ్లు.. ఉగాది నాటికి పట్టాలు

కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్లను నిర్మించాలని అధికారులను జగన్ ఆదేశించారు. వారు కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: September 27, 2019, 9:26 PM IST
కృష్ణా కరకట్ట ప్రజలకు కొత్త ఇళ్లు.. ఉగాది నాటికి పట్టాలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
  • Share this:
కృష్ణా నది కరకట్ట మీదున్న నిర్మాణాలపై ఏపీలో దుమారం రేగుతోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని కూడా అక్రమ కట్టడంగా తేల్చడంతో రాజకీయ రచ్చ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్లను నిర్మించాలని అధికారులను జగన్ ఆదేశించారు. వారు కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేశారు. పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వీటి కారణంగా పేదలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి డిజైన్లతో ఇళ్లను కట్టి ఉగాది నాటికి పట్టాలను అందజేయాలని స్పష్టంచేశారు.

అమరావతిలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వరదనీరు ప్రవహించే మార్గాల్లో నిర్మాణాల కారణంగా పరిస్థితులు దుర్భరంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ముంబై, చెన్నైలాంటి నగరాల్లో ఏం జరుగుతోందో చూస్తున్నామని.. అటువంటి పరిస్థితి అమరావతికి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు జగన్. బకింగ్‌ హాం కెనాల్‌ కాలుష్యంకాకుండా చూడాలన్న సీఎం.. కాల్వ గట్లపై విస్తారంగా చెట్లను పెంచాలని ఆదేశించారు. ఇక మున్సిపల్‌ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకోవాలని.. ఏ పౌరుడూ, ఏ బిల్డరు కూడా లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు.

ఇక తాడేపల్లి, మంగళగిరి మోడల్‌ మున్సిపాల్టీలుగా తయారు చేయడంపై సమావేశంలో చర్చ జరిగింది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధికోసం ప్రతిపాదనలపై చర్చించారు. తాడేపల్లి, మంగళగిరుల్లో ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలో కనీసం 15వేల ఇళ్లు ఇవ్వాలని సూచించారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పారు. తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశాలు జారీచేశారు జగన్.
Published by: Shiva Kumar Addula
First published: September 27, 2019, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading