తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్న ఏపీ సీఎం వైఎస్ జగన్... మొదట విడతలో భాగంగా వారికి చెక్కులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. బాధితుల్లో 3,69,655 మందికి తొలివిడతలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. గురువారం గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం జగన్ డబ్బుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి బడ్జెట్ లోనే అగ్రి గోల్డ్ బాధితుల కోసం రూ. 1,150 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయ ప్రక్రియలో జాప్యం కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే బాధితులకు చెల్లింపులు చేయాలనే నిర్ణయించారు.
10వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గతనెల అక్టోబర్ 18వ తేదీన 263.99 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల పరిధిలో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి న్యాయం జరుగుతోంది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ(డీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా ఈ సొమ్మును బాధితులకు అందచేయనున్నారు. అలాగే ఇరవై వేల రూపాయల లోపు వున్న మరో 4లక్షల మంది డిపాజిట్ దారులకు కూడా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా వున్నట్లు అధికారులు చెబుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.