news18-telugu
Updated: January 5, 2021, 8:07 PM IST
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
Attack on Temples in Andhra Pradesh: రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్రంలో గుళ్లపై దాడులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ జరుగుతోందని అన్నారు. దాడులు చేస్తున్నవాళ్లే.. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో తమను ఎదుర్కొలేకే కొందరు ఇలా ఆలయాలపై దాడుల ముసుగులో దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కొందరు దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారని ఏపీ సీఎం జగన్ దుయ్యబట్టారు.
జన సంచారం ఎక్కువగా లేని గుళ్లను టార్గెట్‌గా చేసుకుని కొందరు ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎవరూ లేని ప్రదేశాల్లో అర్ధరాత్రి పూట అందరూ పడుకున్నాక ఉద్దేశపూర్వకంగా గుళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. గుళ్లపై దాడులు చేయాలంటేనే భయపడేలా చేయాలని పోలీసులను ఆదేశించారు. మత, కులాల మధ్య విద్వేషాలు పెంచేవారిపట్ల పోలీసుల కఠినంగా వ్యవహరించాలని జగన్ స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనల్లో ప్రమేయమున్న ఎవ్వరినీ లెక్క చేయొద్దని పోలీసులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ రాజకీయ గొరిల్లా వార్‌ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో ఆలయాల వద్ద ఇప్పటివరకూ 36వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలని సూచించారు. ఆలయాలపై దాడుల అంశంపై లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
January 5, 2021, 3:45 PM IST