రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేరుతో వెలువడిన లేఖ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీరియస్ తీసుకుంది. ఈసీ పేరుతో కేంద్ర హోంశాఖకు తానే స్వయంగా లేఖ రాసినట్లు రమేష్ కుమార్ ఇప్పటికీ చెప్పకపోవడంతో.. ఈ అంశాన్ని రాజకీయ కుట్రగా ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ మనీష్‌కుమార్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ కేంద్రం హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖపై చర్చ నిర్వహించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా తీవ్ర పదజాలంతో రాసిన.. ఆకాశరామన్న లేఖను జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.
లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ లేఖ వ్యవహారంపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ప్రచారం చేస్తున్నా.. రమేష్ స్పందించకపోవడంపై వైసీపీ సర్కార్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఈసీ లేఖపై మంత్రులు తీవ్ర స్థాయిలో స్పందించారు. రమేష్ కుమార్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తంచేశారు.
లేఖపై రమేష్ కుమార్ ఎందుకు స్పందిచలేదని ప్రశ్నించారు. ఆయన వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈసీ లేఖపై రమేష్ వెంటనే స్పందించాలని మరో మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆయన లేఖ రాసి ఉండకపోతే దానిపై విచారణ జరపాలని డీజీపీ కోరాలని అన్నారు. లేఖ వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలను ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అవంతి మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Damodar Goutam Sawang, Nimmagadda Ramesh Kumar