ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకోగా.. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) వరద పరిస్థితులపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అండగా నిలవాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సీఎం జగన్ అన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని, బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంటనూనె, కిలో బంగాళదుంపలు, కిలో ఉల్లిపాయలు అందజేయాలని చెప్పారు.
ఇక నీట మునిగిన పంటలను కూడా పరిశీలించి జరిగిన నష్టంపై పక్కాగా అంచనాలు రూపొందించాలన్నారు. అలాగే పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు సాగు చేసేలా గతంలోనే ప్రకటించిన విధంగా వారికి విత్తనాలు, తదితరమైనవి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలని సీఎం నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతంలోనే ఉండి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.
ఇదిలా ఉంటే చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. పెన్నానది ఉప్పొంగడంతో నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం పూర్తిగా నీటమునిగింది. లోతట్టు ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు ఇళ్లు నీటమునిగాయి. పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ నీటిలో కొట్టుకోవడంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపేశారు. కోవూరు వద్ద జాతీయ రహదారి కోతకు గురికావడంతో నెల్లూరు-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక కడప జిల్లా కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై బ్రిడ్జి కూలిపోవడంతో కడప-కమలాపురం మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తిరుపతి రామచంద్రాపురం మండలం రాయలచెరువుకు భారీగా వరదనీరు చేరింది. చెరువుకు ఔట్ ఫ్లో లేకపోవడంతో కట్టలు లీకవుతున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొండలపైకి వెళ్లిపోతున్నారు. అధికారులు నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.