విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అందులో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను గుర్తించాలని అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్ లీక్ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్ కే మీనా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని సీఎస్ నీలం సాహ్ని సీఎం జగన్‌కు వివరించారు.
ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ నివారణకు చేపట్టిన చర్యలను సీఎంకు వివరించిన కలెక్టర్... ట్యాంకర్‌లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్ అయ్యిందని తెలిపారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయని వెల్లడించారు. విశాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్, పీసీబీ మెంబర్‌సెక్రటరీ వివేక్ యాదవ్ వస్తున్నారని అధికారులకు తెలిపిన సీఎం జగన్... ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని ఆదేశించారు.
కాలుష్య నియంత్రణ మండలి క్రియాశీలకంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలని అదేశాలు జారీ చేశారు. అలాగే ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.