Andhra Pradesh: ఏపీలో నూతన విద్యావిధానంపై ముందడుగు... స్కూళ్ల పెంపుపై కీలక నిర్ణయం

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

నూతన విద్యావిధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక ముందడుగు వేసింది. స్కూళ్ల వర్గీకరణను ఖరారు చేసింది.

 • Share this:
  నూతన విద్యావిధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. స్కూళ్ల వర్గీకరణను ఖరారు చేసింది. ఇందులో శాటిలైట్‌ స్కూల్స్‌ ( పీపీ–1, పీపీ–2), ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2. 1, 2), ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ), ప్రీ హైస్కూల్స్‌ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ), హైస్కూల్స్‌ ( 3 నుంచి 10వ తరగతి వరకూ ), హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ), పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణవల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌ 44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలని.. టీచర్ల నియామకం విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్లుగా ఉండాలన్నారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలన్నారు. వివిధ తరగతుల్లో ఉన్న సబ్జెక్టులు, వాటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

  ఆ నిబంధనలను పాటిస్తూనే... 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో విషయ నిపుణులైన టీచర్లద్వారా చక్కటి బోధన అందించడానికి తగిన సంఖ్యలో టీచర్లను పెట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నూతన విద్యా విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని సీఎం అన్నారు. అలాగే విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో బోధన అందుతుందని.. ప్రపంచస్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులు తయారు అవుతారని అభిప్రాయపడ్డారు.

  ఇది చదవండి: ఏపీలో వింత.. కోడిపుంజు చేసిన పనికి అంతా షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!


  సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలోకూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయని జగన్ అన్నారు. దీనివల్ల ఉపాధ్యాయులపై పనిభారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుందన్నారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం ఆదేశించారు. నూతన విద్యావిధానం, నాడు –నేడుల కోసం మొత్తంగా సుమారు రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

  ఇది చదవండి: ఎమ్మెల్యే రోజాకు రోజాపూలతో అభిషేకం... పూలవానలో తడిసి ముద్దైన జబర్దస్త్ జడ్జ్


  నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.., ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలన్న సీఎం జగన్ ఆదేశించారు. నూతన విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాలన్న సీఎందీనిపై ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఇక రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాకానుక కార్యక్రమాన్ని ఈనెల 16న సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. అమ్మ ఒడి, ఇంగ్లిషు మీడియం, నాడు – నేడు తదితర విప్లవాత్మక మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 2014–15 నాటికి రాష్ట్రంలోని అన్నిరకాల స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ 72.33 లక్షలు కాగా 2018–19 నాటికి అది 70.43 లక్షలకు పడిపోయిందని అధికారులు తెలిపారు.

  ఇది చదవండి: సోషల్ మీడియాలో సీఎం జగన్ జోరు.. కొత్త యాప్ ద్వారా ప్రజలకు మరింత చేరువ


  అమ్మఒడి పథకం వల్ల 2020–21 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 73.06 లక్షలకు చేరుకుందన్నారు. 2.63 లక్షలమంది పిల్లలు అధికంగా చేరినట్లు వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 2014–15 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య 42.83 లక్షల మంది కాగా 2018–19 నాటికి ఆ సంఖ్య 37.21 లక్షలకు పడిపోయిందన్నారు.2020–21 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 43.44 లక్షలకు చేరిందని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం పెరిగిందని, అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపాలన్న కోరిక బలపడిందని అధికారులు వెల్లడించారు.

  ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
  Published by:Purna Chandra
  First published: