తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - క్లోర్ ఆల్కలీ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్( కాస్టిక్ సోడా యూనిట్)ను సీఎం జగన్ (CM YS Jagan) ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎంతో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా పాల్గొన్నారు. అనపర్తిలో దాదాపుగా రూ.1000 కోట్ల ఖర్చుతో పరిశ్రమ పెట్టారని.., మూడు దశలలో కలిపి దాదాపుగా రూ.2470 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 2450 మందికి ఉద్యోగాల కల్పించే పరిశ్రమ ఇదని జగన్ అన్నారు. బిర్లా లాంటి వాళ్లు ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని సీఎం చెప్పారు. ఈ రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలన్నీ కూడా కచ్చితంగా స్ధానికులకే ఇవ్వాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం. ఇలాంటి చట్టం తీసుకొచ్చిన నేపధ్యంలో ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి పెద్దవాళ్లు అడుగులు ముందుకువేయాలని పిలుపునిచ్చారు. అలాగే పరిశ్రమ ఏర్పాటు సందర్భంగా స్థానికులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు జీవో ఇస్తున్నామని జగన్ ప్రకటించారు.
అలాంటి సందర్భంలో ఈ ప్రాజెక్టు నేపధ్యం గురించి కూడా చూస్తే... మనకన్నా చాలా సంవత్సరాల ముందు 2010–12 మద్య ప్రాంతంలో రక,రకాల ఇబ్బందులు పడుతూ వచ్చిందన్నారు. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గ్రాసిమ్ సంస్ధకు అప్పగిస్తూ సంతకాలు చేసిందని., ఆ తర్వాత ప్రాజెక్టుకు ఇంతకు ముందున్న సమస్యలు అలాగే కొనసాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వ పెద్దలు సంతకాలు చేసారు కానీ సమస్యలు పరిష్కారం చేయలేదని.. సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేస్తే పరిశ్రమ రాదు అన్న కనీస ఆలోచన కూడా లేకుండా అడుగులు ముందుకు వేశారని జగన్ విమర్శించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయని.., వీటిని పరిష్కరిస్తూ... ఒక మార్గం చూపించి ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టించగలిగితే వేల కోట్ల రూపాయులు పెట్టుబడులు రావడమే కాకుండా.. దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న ఆలోచనతో ఆ సమస్యలన్నీ అధిగమించేందుకు పరిష్కారం చూపుతూ అడుగులు వేసిన్లు వివరించారు.
ఈ పరిశ్రమ వస్తే గ్రామం కాలుష్యమవుతుందన్న భయాల నేపధ్యంలో... కేప్టివ్ థర్మల్ ప్లాంట్ వినియోగంలోకి వస్తే దానివల్ల ఈ భయాలు ఇంకా ఎక్కువవుతాయని అనుకున్న పరిస్థితుల్లో కేప్టివ్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టకూడదని ఆదిత్యా బిర్లా గ్రూప్ యాజమాన్యాన్ని కూడా ఒప్పించామన్నారు. అది కాకుండా పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ వదిలేస్తే.. నీరు కలుషితమయ్యే విషయంలో కూడా స్ధానికులకు రకరకాల ఆందోళనలు, భయాలు ఉన్న వాతావరణం గతంలో చూశామని.., దానిని కూడా అధిగమించేందుకు టెక్నాలజీలో కూడా ఏకంగా మార్పులు చేశామన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.