కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా ఉన్నామన్నారు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan). బుధవారం నాబార్డ్ (NABARD) వార్షిక ప్రణాళికపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్ సహకరిస్తోందని.. కొవిడ్ సమయంలోనూ సహాయం చేశారన్నారు. తమ హయాంలో రైతులకు రైతు భరోసా (Rythu Bharosa), సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమం కోసం చేయాల్సిందల్లా చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇ-క్రాప్ నమోదు చేసి పారదర్శకంగా చెల్లింపులు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా రైతులకు అండగా ఉన్నట్లు వివరించారు. గ్రామస్థాయిలోనే ఇ-క్రాపింగ్ చేపటుజూ వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గ్రామీణ నియోజకవర్గాల స్థాయిలో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేశామని.. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు.. ఏర్పాటు చేశామని.. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నట్లు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ తీసుకురావడానికే ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. అలాగే సహకార బ్యాంకులు, సొసైటీలను బలోపేతం చేస్తూ పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామన్నారు జగన్.
ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారని., దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు జగన్ చెప్పారు. ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టామన్న సీఎం.. వ్యసాయంలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తామని.. వీటి నిర్వహించే నైపుణ్యాన్ని గ్రామస్తాయిలోనే అభివృద్ధి చేస్తామన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో పాటు నాడు-నేడు కింద 11 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. ఇక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టమని.. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించామన్నారు. భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ నరులుగా అభివృద్ధి చెందుతారన్నారు. గ్రామస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారన సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
ఫ్లోరోసిస్ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయన్న జగన్.. అలాంటి ప్రాంతాల్లోని వారికి రక్షిత తాగునీరు అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు జగన్ తెలిపారు. మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు సీఎం వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.