ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ధాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా కేంద్రాలు (Rythu Bharosa kendras), పౌరసరఫరాల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎం అన్నారు. విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా, పిషరీస్, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్‌జీల నిర్వహణ తదితర కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ పనులన్నీ సమర్థవంతంగా ముందుకు సాగాలంటే.. సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్స్ మధ్య అన్నీ చక్కటి సమన్వయం అవసరమన్నారు. వ్యవసాయం, ఫిషరీస్, రెవిన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ తదితర శాఖలతో సమన్వయం సమర్థవంతంగా ఉండాలని చెప్పారు.
ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగేందుకు వీలుగా సమర్థవంతమైన మార్గదర్శక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల్లో క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా, విచక్షణారహితంగా ఎరువులు, పురుగుమందులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలన్నారు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరైతుకు తన భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు.
రైతు సాగుచేస్తున్న భూమి స్థితిగతులు ఏంటి..? ఎలాంటి పంటలకు అనుకూలం? ఎలాంటి రకాలు వేయాలి..? ఎంతమోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కల్పించాలి ఆదేశించారు. దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువుల వాడకం తగ్గుతుందని చెప్పారు. ఒక మనిషికి డాక్టర్ ఎలా ఉపయోగపడతాడో, పంటలసాగులో రైతులకు ఆర్బీకేలు అదే విధంగా ఉపయోగపడాలని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత సాయిల్ టెస్టులు చేసేవిధంగా ఒక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తరహాలో.. ఒక కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు ఈ విషయంలో సలహాలు సూచనలు గ్రామాల్లో అందాలని సూచించారు.
ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని.., రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందేని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదన్న సీఎం.., ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ టెస్టింగ్, క్వాంటిటీ టెస్టింగ్ జరగాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియమీద, ఎంఎస్‌పీ మీద, అనుసరించాల్సిన నియమాలమీద రైతుల్లో అవగాహన కల్పించాలన్న సీఎం.., దీనికి సంబంధించి కరపత్రాలను, పోస్టర్లను, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బీకేల స్థాయిలో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకోవాలని.., దాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామసచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government