అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ (CM YS Jagan) పాలనపైనే దృష్టిపెట్టారు. సంక్షేమ పథకాలు, నిధుల సమీకరణ, కొత్త పథకాల ప్రారంభం వంటివాటికే తన సమయాన్నంతా కేటాయిస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా ఆయన పార్టీని పట్టించుకోలేదనే మాట కూడా వినిపింది. ఐతే ఇకపై పాలనతో పాటు పార్టీపైనా జగన్ దృష్టిపెట్టబోతున్నారట. త్వరలోనే వైసీపీ (YSRCP) ప్రక్షాళన చేసి ఎన్నికలకు సమాయత్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకున్న ఆయన.. వాటి ప్రకారం ఎమ్మెల్యేలు, నేతలకు పార్టీ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ప్రతి ఒక్కరితోనూ ఫేస్ టు ఫేస్ మాట్లాడనున్నట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది జగన్ తో నేరుగా భేటీ అయింది లేదు. సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేలు సీఎంను కలిసే అవకాశం దక్కింది. సీఎం నేరుగా ఎమ్మెల్యేలను కలవకపోయినా వారి పనితీరు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే వచ్చే మూడు నెలల్లో రివ్యూ చేపట్టనున్నట్లు సమాచారం.
సీఎం జగన్ నిర్వహించే సమీక్షల్లో ఎమ్మెల్యేలే కాకుండా.. ఆయా నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు. పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నవారు, మంత్రులు, ఇన్ చార్జ్ మంత్రులు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో వారానికి రెండు లేదా మూడు జిల్లాల చొప్పున సమీక్ష జరిపి దిశానిర్దేశం చేస్తారని టాక్. పార్టీ నేతలు, ఇన్ ఛార్జుల నుంచి ఎమ్మెల్యేల పనీతీరుపై ఇన్ పుట్స్ తీసుకోవడమే కాకండా.. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని జగన్ చేపట్టాలనుకున్నా.. కరోనా పరిస్థితులు, ఇతర కారణాల వల్ల లేట్ అయిందట.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 13 జిల్లాలకు పార్టీ నుంచి ఐదురు ఇన్ ఛార్జులను సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే. వీరిలో విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ రిజనల్ ఇన్ ఛార్జుల్లో ఒకరిద్దరిని తప్పించి కొత్తవారికి అవకాశమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులుంటాయన్న ప్రచారం సాగుతున్నందున పార్టీ ప్రక్షాళణ తర్వాతే సీఎం కేబినెట్ పై దృష్టిపెట్టనున్నారట. పార్టీ కోసం కష్టపడుతున్నవారిలో కొందరికి పార్టీ పదవులిచ్చి.. మరికొందరికి మంత్రి పదవులివ్వాలని సీఎం డిసైడ్ అయినట్లు సమాచారం.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.