సీఎం జగన్ ఐటీ రంగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ కల్పన, ప్రాంతాల మధ్య సమతుల్యత, పర్యావరణ సానుకూల అభివృద్ధి కేంద్రంగా నూతన పారిశ్రామిక విధానం రూపొందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 2020-23 పారిశ్రామిక విధానంపై అధికారుతో సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగానే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్నత శ్రేణి నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఐటీ రంగం గొప్ప మలుపు తిరుగుతుందని, అన్ని యూనివర్సిటీల్లోనూ ఎక్స్టెన్షన్ విధానాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు సాధించడంపైనా దృష్టి సారిస్తున్నామని, ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ, చేయూతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జగన్ ఆదేశించారు.
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. పరివ్రమలకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వాటి నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడం అంతే ప్రధానమని చెప్పారు. రంగాల వారీగా ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి కాలుష్య నివారణ చర్యలను పరిశ్రమలే పాటించేలా చూడాలని సూచించారు.