తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. వైఎస్ రాజకీయ వారసురాలిగా దివంగత నేత కుమార్తె వైఎస్ షర్మిల తెంగాణలో తన పార్టీని ప్రకటించారు. సరిగ్గా తండ్రి జయంతి రోజే.. ఉదయం కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. వైఎస్‌కు నివాళులర్పించిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్న ఆమె అధికారికంగా తెలంగాణలో తన పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో రాజన్న పాలన తీసుకు రావడమే తన లక్ష్యమంటూ ప్రకటించిన ఆమె.. తన పార్టీకి వైఎస్ఆర్టీపీగా పేరు పెట్టారు.
అయితే షర్మిల అధికారిక ప్రకటన చేయకముందే ఆమె పార్టీపై ప్రముఖులంతా స్పందించారు. తాజాగా పవన్ కళ్యాణ్ సైతం ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. అందరూ స్పందిస్తున్నా.. సొంత అన్నయ్య సీఎం జగన్ స్పందించకపోవడంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా జగన్ కు షర్మిలకు మధ్య గ్యాప్ పెరిగిందని.. అందుకే ఎదురెదురు పడడానికి కూడా ఇష్టపడడం లేదని అంతా భావిస్తున్నారు. ఇవాళ ఇడుపుల పాయలో ఘటనతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. సాధారణంగా వైఎస్ జయంతి అంటే కుటుంబ సభ్యులు అంతా కలిసి ఆయనకు నివాళులర్పిస్తారు. కానీ షర్మిల ఉదయం ఇడుపులపాయకు వెళ్తే.. సీఎం జగన్ సాయంత్రానికి తన షెడ్యూల్ ను మార్చుకున్నారు అంటూ ప్రచారం జరిగింది కూడా..
ఇదీ చదవండి: జగన్ బెయిల్ రద్దుకు ఆ కారణాలు చాలా..? ఈ నెల 14కి విచారణ వాయిదా..
వైఎస్ కుటుంబ సభ్యులు కూడా షర్మిల వైపే నిలబడ్డారని.. ఆ కుటుంబంలో జగన్ ఒంటరి అయ్యారంటూ చాలా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా ఆ వార్తలపై వైసీపీ తరపున సజ్జల వివరణ ఇచ్చారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని.. అదే సమయంలో జగన్, షర్మిల ఒకేచోటు కలిస్తే.. పలు రకాల ఊహాగానాలు వస్తాయని.. అందుకే ఆయన షర్మిలను కలవలేదని వివరణ ఇచ్చారు. ఆయన వివరణ ఇద్దరి మధ్య విబేధాలు నిజమే అన్నదానికి బలం చేకూరేలా చేసింది. ఎదురుపడడం కుదరకపోతే కనీసం చెల్లికి శుభాకాంక్షలైనా ఎందుకు చెప్పలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి...
ఇదీ చదవండి: ఏపీ ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాల ప్రకటన ఎప్పుడంటే.. మార్కులపై క్లారిటీ
షర్మిల-జగన్ ల మధ్య విబేధాల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పటి వరకు ఆమె పార్టీపై నేరుగా సీఎం జగన్ ఒక్కసారి కూడా మాట్లడలేదు. కానీ ఇవాళ పరోక్షంగా షర్మిల పార్టీపై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై మాట్లాడిన ఆయన.. ఏ ఒక్క పక్క రాష్ట్రంతో మాకు విభేదాలు వద్దనుకున్నామన్నారు. అక్కడితో ఆగకుండా.. పక్క రాష్ట్రాలతో మేం సఖ్యత కోరుకుంటామని.. అక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఇది తన చెల్లిన ఉద్దేశించే మాట్లాడరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. వైసీపీ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టదన్నారు. అలాగే కర్ణాటక రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టదని.. భవిష్యత్తులో కూడా వేలు పెట్టమని స్పష్టత ఇచ్చారు. అయితే ఆయన జలవివాదాలు గురించే ప్రస్తావించినా.. ఈ మాటలు మాత్రం షర్మిలను ఉద్దేశించే చెప్పారనే ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, YS Sharmila, YSR, Ysrcp