CM Jagan: దేవుడితోనే ఆటలా? సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

CM Jagan: దేవుడితోనే ఆటలా? సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో హిందూ ఆలయాల (Hindu Temples)పై దాడులపై సీఎం జగన్మోహన్ రెడ్డి (YS JaganMohanReddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో పెట్టుకుంటే శిక్షతప్పదని హెచ్చరించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లోని హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.., విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటనపై సీరియస్ అయ్యారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు దారుణమని సీఎం జగన్ అన్నారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడన్నారు. విగ్రహాల విధ్వంసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పోలీసులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

    అసలేం జరిగింది..?
    విజయనగరం జిల్లా పవిత్ర పుణ్య‌క్షేత్రం రామతీర్థంలోని కోదండ రామస్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్‌ రోజువారిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

    ఐతే శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన శిరస్సు భాగాన్ని ఆలయంలోని రామకొలనులో గుర్తించారు. లోతైన కొలనులో గాలించగా.. 6 గంటల తర్వాత శ్రీరాముని శిరస్సు భాగాన్ని గుర్తించారు. అనంతరం జై శ్రీరాం నినాదాల మధ్య శిరస్సును ఆలయానికి చేర్చారు. చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిథులతో శిరస్సు పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    మరోవైపు రామతీర్థ క్షేత్రంలో రాముడి విగ్రహం ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ హయంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆలయాలకు రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై శ్రీ కోదండరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని  పవన్ పిలుపునిచ్చారు. విగ్రహం శిరస్సు కనిపించకుండా ధ్వంసం చేయడాన్ని చూసి చాలా బాధకలిగిందని పేర్కొన్నారు. ఇది మత మౌధ్యం తలెక్కిన ఉన్మాదపు చర్య అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంతరవేది రథం దగ్ధం, దుర్గగుడిలో రథంపై సింహాల ప్రతిమల చోరీ ఘటనలు మరవకముందే రామతీర్థ ఆలయంపై దాడి చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సీఎం జగన్.. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
    Published by:Purna Chandra
    First published: