news18-telugu
Updated: October 2, 2020, 2:52 PM IST
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ వారికి అభినందనలు తెలియజేశారు. గ్రామాల్లో ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయం కావాలన్నాకూడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్యం అందరికీ కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. లాభాపేక్ష లేకుండా సేవలు చేస్తున్నారని కితాబిచ్చారు.
వీరిని అభినందిస్తూ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఇళ్లనుంచి బయటకు వచ్చి చప్పట్టు కొట్టి అభినందించాలని ప్రజలకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. తాను సాయంత్రం 7 గంటలకు బయటకు ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొడతాననని అన్నారు. వాళ్లకు మన వంతు ఆదరణ చూపించాలని కోరారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్
గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. నేడు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని అన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ , రైతు భరోసా సాయం అందిస్తున్నామని వెల్లడించారు.
మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తానని సీఎం జగన్ తెలిపారు. భూ వివాదాలకు ఎక్కడా తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా పంపిణీ చేశామని అన్నారు. గిరిజనులకు భూమితో పాటు రైతు భరోసా కింద సాయం అందిస్తామని వెల్లడించారు. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్ధిక సాయం అందిస్తామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా రాలేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలకు, కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టామని అన్నారు. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, బుట్టాయిగూడెం, రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని అన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకం కింద గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నాు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
October 2, 2020, 2:38 PM IST