ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ తరఫున సీజేఐకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా.. ఆ పట్టాను యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (BBiswa Bhushan Harichandan) అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తాను చదివిన యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందండం సంతోషంగా ఉందన్నారు. ఆచార్య నాగార్జున సిద్ధాంతాల స్ఫూర్తితో స్థాపించిన ఏఎన్‌యూ విద్యా రంగానికి ఎన్నో సేవలందించిందని కొనియాడారు.
"యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అసోసియేషన్ కారణంగానే నేను ఇక్కడ చేరాను. అసోసియేషన్ నేతలు వచ్చి పట్టుపట్టడంతో లా స్టూడెంట్‌గా యూనివర్సిటీలో చేరాను. యూనివర్సిటీలో మా అడ్డా క్యాంటీనే. క్యాంటీన్‌లో కూర్చొని అనేక విషయాలపై చర్చించే వాళ్లం. లా కాలేజీ వల్ల మిగతా విద్యార్థులు చెడిపోతున్నారని.. మా కాలేజీని తరలించాలనే ప్రతిపాదన జరిగింది. గతంలో వివిధ అంశాలపై యువతలో చర్చ జరిగేది.. కానీ, ఇప్పుడు అలాంటి చర్చ జరగడం లేదు" అని జస్టిస్ ఎన్వీ రమణ తన యూనివర్సిటీ రోజులను గుర్తు చేసుకున్నారు.
సమస్యలపై యువత స్పందించకపోవడం సమాజానికి మంచిది కాదని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యా విధానం ఉండాలన్నారు. అన్ని రకాల అసమానతలు తొలగాలంటే విద్యా రంగమే కీలకమన్నారు. ఎంతో మేధో మథనం తర్వాత 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. హ్యుమానిటీ, చరిత్ర వంటి సబ్జెక్టులపై ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. హోలిస్టిక్ విద్యా విధానం ఉన్నప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అని సీజేఐ అభిప్రాయపడ్డారు.
యూనివర్సిటీలు రీసెర్చ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. రీసెర్చ్ వింగ్ కోసం యూనివర్సిటీలు కూడా అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయింపులు జరపాలన్నారు. యూనివర్సిటీకి అవసరమైన వసతులు కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 37, 38వ స్నాతకోత్సవం కార్యక్రమంలో భాగంగా డాక్టరేట్, మాస్టర్ డిగ్రీలు పొందిన విద్యార్థులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పట్టాలు అందజేశారు. పట్టాలు పొందిన విద్యార్థులను ఈ సందర్భంగా సీజేఐ అభినందించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో చదివి.. అదే యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ పొందం ఇదే తొలిసారి అని అన్నారు. సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ పట్టా ఇవ్వడం అద్భుతమైన ఘట్టమని కొనియాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Biswa Bhushan Harichand, Botsa satyanarayana, NV Ramana