Ramatheerdham Incident: రామతీర్థంపై రంగంలోకి సీఐడీ..! ఒక్కరోజులోనే యాక్షన్ స్టార్ట్..!

రామతీర్థం ఘటనపై సీఐడీ దర్యాప్తు ప్రారంబం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయనగరం జిల్లా (Vizianagaram District) రామతీర్థం ఘటన( Ramatheerdham Incident) పై సీఐడీ (CID) రంగంలోకి దిగింది. కేసులో కీలక సాక్ష్యాలను సేకరించినట్లు తెలుస్తోంది.

 • Share this:
  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రామతీర్థం ఘటనలో సీఐడీ రంగంలోకి దిగింది. ఆలయంపై దాడి, రాముని విగ్రహ ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన ఒక్కరోజులోనే సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబందించి నెల్లిమర్ల పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన అధికారులు అధునాత సాంకేతికతతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితులను పట్టుకునేందుకు యత్నించారు. ఐతే డాగ్ స్క్వాడ్ గర్భగుడి నుంచి కోనేరు వరకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో టెక్నాలజీ సాయంతో దర్యాప్తు అధికారులు సాగిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ రై సీఐడీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

  కీలక ఆధారాలు లభ్యం
  ఇప్పటికే క్లూజ్ టీమ్ రాముని విగ్రహంతో పాటు కోనేట్లో దొరికిన హ్యాక్సా బ్లేడ్, ఆలయ తాళం, ద్వారాలపై వేలి ముద్రలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. విచారణ బృందం ఆలయ పరిసర ప్రాంతాల్లో అణువణువునా గాలించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే ఆలయాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న అనుమానితులు, వారు ఇచ్చిన సమాచారాన్ని కూడా సీఐడీ తీసుకుంది. అలాగే ఘటన జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపైనా సీఐడీ దృష్టి పెట్టింది. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ సాయం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

  రామతీర్థం కేసులో విజయనగరం జిల్లా పోలీసులు ఇప్పటివరకు 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఐతే తమవారు ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని అరెస్టైన వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

  విగ్రహ పునఃప్రతిష్టకు ఏర్పాట్లు
  ఇక దేవాలయం పునరుద్ధరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోదండ రాముని విగ్రహ పునఃప్రతిష్ఠపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అర్చకుకులు, పండితులతో చర్చించారు. ఆలయాన్ని ఆధునీకరించడతో పాటు.. కేవలం నెల రోజుల్లో రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఐతే రామతీర్థ ఆలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని.. దీని వెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రామతీర్థంపై రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు సూచించారు మంత్రి వెల్లంపల్లి. దోషులను రెండురోజుల్లోనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  రాజకీయ దుమారం
  మరోవైపు ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. వైసీపీ చేస్తున్న మంచి పనులను చూసి తట్టుకోలేక.. చెడ్డ పేరు తెచ్చేందుకు టీడీపీయే ఇలాంటి దాడులు చేయిస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన ప్రాంతాల్లోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆలయాలకు రక్షణ లేకుండాపోయిందని.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తమపై బురద జల్లుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలపై దాడులకు నిరసగా ఇవాళ బీజేపీ-జనసేన పార్టీలు రామతీర్థ రథయాత్రకు పిలుపునివ్వగా అనుమతులు లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు.
  Published by:Purna Chandra
  First published: