హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chittoor Fire Accident: చిత్తూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. తండ్రీకొడుకులు సహా ముగ్గురు మృతి

Chittoor Fire Accident: చిత్తూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. తండ్రీకొడుకులు సహా ముగ్గురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chittoor Fire Accident: పేపర్ ప్లేట్ల యూనిట్‌లో మంటలను చూసి స్థానికులు అగ్నిమాపక శాఖకు కాల్ చేశారు. కానీ సకాలంలో ఫైరింజన్లు చేసుకోలేదని.. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని అన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Chittoor

  చిత్తూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం (Chittoor Fire Accident) జరిగింది. పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో కాలిపోయి ముగ్గురు వ్యక్తులు మరణించారు. చిత్తూరు (Chittoor)లోని రంగాచారీ వీధిలో రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. భాస్కర్ (65) అనే వ్యక్తి రంగాచారీ వీధిలో రెండంతస్తుల భవనం ఉంది. అందులో గ్రౌండ్ ఫ్లోర్‌లో పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. రెండో అంతస్తులో వారు నివసిస్తున్నారు. ఐతే మంగళవారం రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్‌లో అగ్నిప్రమాదం (Fire accident in paper plates unit) జరిగింది. పేపర్ ప్లేట్స్‌కు త్వరగా కాలిపోయే గుణం ఉండడంతో.. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. రెండో అంతస్తుకు కూడా మంటలంటుకున్నాయి. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిని భాస్కర్, డిల్లీ బాబు (35), బాలాజీ (25)గా గుర్తించారు. భాస్కర్, డిల్లీబాబు తండ్రీకొడుకులు.

  ఈ ఘటనతో చిత్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పేపర్ ప్లేట్ల యూనిట్‌లో మంటలను చూసి స్థానికులు అగ్నిమాపక శాఖకు కాల్ చేశారు. కానీ సకాలంలో ఫైరింజన్లు చేసుకోలేదని.. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని అన్నారు. అయినప్పటికీ స్థానికులు తలుపులను బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. డిల్లీ బాబు నిన్ననే పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగానే అతడి స్నేహితుడు బాలాజీ వారి ఇంటికి వచ్చాడు. ప్రమాద సమయంలో పేపర్ ప్లేట్స్ తయారీ జరగలేదని స్థానికులు చెప్పారు. ఇంట్లో ముగ్గురే ఉన్నారని.. వారు గాఢ నిద్రలో ఉన్న సమమయంలో మంటలు చెలరేగాయని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

  అటు కాకినాడలోనూ మరో అగ్నిప్రమాదం (Kakinada Fire Accident) జరిగింది. రాజానగరంలోని దివాన్ చెరువు సమీపంలో ఉన్న మోమీన్ టైర్ షాప్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేరని.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Chittoor, Fire Accident

  ఉత్తమ కథలు