GT Hemanth Kumar, Tirupathi, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా థర్డ్ వేవ్ (Corona Thirdwave) ఉధృతంగా ఉంది. చూస్తుండగానే పాజిటివిటీ రేటు 18శాతానికి చేరిపోయింది. ముఖ్యంగా రెండు జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు వెయ్యి నుంచి 1500 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో 8వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం కరోనా బులిటెన్లో ఒక్క చిత్తూరులోనే 1,534 పాజిటివ్ కేసులు నమోదనట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు కూడా భారీ స్థాయిలోఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయి.
టెస్టుల కోసం అగచాట్లు..
రాయలసీమ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వైరాలజీ ల్యాబ్ లు తిరుపతిలోనే ఉన్నాయి. ఒకటి స్విమ్స్ కాగా మరొకటి రుయా ఆసుపత్రి. ఇక్క రోజుకు కొన్నివందల సంఖ్యలో వివిధ రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు రోజురోజుకు అధికం అవుతుండటంతో అధికారులు టెస్టింగ్ కెపాసిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు, భారీగా చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాల బారిన పడున్నారు.
తమకు వచ్చింది స్సాధారణ జ్వరమేనా, లేక కరోనానో తెలియక జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇప్పటికే సగటున 40 శాతం మంది సాధారణ చలి జ్వరం, జలుబు దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు టెస్టింగ్ కి వెళితే ఎక్కడ పాజిటివ్ వస్తుందో అని బయపడి వెనకడుగు వేస్తుంటే.., మరి కొందరు వైరస్ నిర్ధారణ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రి వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆర్టీపీసీఆర్ స్వాబ్ టెస్టింగ్ కోసం వెళ్లినవారికి నిరీక్షణ తప్పడం లేదు. ఇంట్లో ఉంటే కుటుంబ సబ్యులకు సోకే ప్రమాదం ఉండటం, పాజిటివ్ రిపోర్ట్ లేనిదే క్వారంటైన్ లో చేర్చుకోక పోవడంతో లక్షణలు ఉన్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
తిరుపతిలి రెండు వైరాలాజీ ల్యాబుల్లో రోజుకి ఒక్కో ల్యాబులో 250 నుంచి 300 టెస్టులు మాత్రమే చేయగలరు. ఇక ఫలితాలు కూడా 24 గంటలు నుంచి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కొందరు రెకమెండేషన్ తో వెళ్తుంటే మరికొందరు ఎలాంటి సిఫార్సు లేకుండా బయట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. దీంతో భారీ స్థాయిలో విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు హాస్పిటల్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వీలైనంత ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలని ఆదేశిస్తున్నారు.
పౌష్ఠిక ఆహారం లేక కరోనా బాధితుల నిరసన
ఇప్పటికీ ప్రభుత్వం తిరుపతిలోని విష్ణునివాసంను కొవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తోంది. ఇక్కడ వేల సంఖ్యలో బాధితులు కరోనా చికిత్స పొందుతున్నారు. కానీ పాచిపోయిన, బూజు పట్టిన నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ బాధితులు సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. ఇటువంటి భోజనం తమకొద్దంటూ వందమందికి పైగా నిరసన తెలిపారు. ఐదు రోజులుగా ఇదేవిధంగా ఆహారం ఉందని, సెలవుల వల్ల ఇలా ఉందని భావించి, సర్దుకున్నామని చెప్పారు. అయితే కాంట్రాక్టర్లకు గతంలో డబ్బులు ఇవ్వకపోవడంతో ఆహారం సరఫరాకు ఎవ్వరూ ముందుకు రాకపోవటం వల్ల ఈ దుస్థితి దాపురించిందని తెలిసిందన్నారు. జిల్లాలో కఠిన ఆంక్షలు విధిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని ప్రజలంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Corona cases