కోడి రూ.3000.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర.. దేశం మొత్తం పడిపోయినా..

ప్రతీకాత్మక చిత్రం

కోడి పందాల బరులకు దగ్గర్లోనే మరో వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. పందెంలో చచ్చిన కోళ్లను వెంటనే అక్కడికక్కడే కాల్చి ఇచ్చేవారు కూడా సిద్ధమయ్యారు. కోళ్లను చక్కగా నిప్పుల మీద కాల్చి.. దాన్ని మొత్తం క్లీన్ చేసి ఇస్తారు.

 • Share this:
  దేశంలో బర్డ్ ఫ్లూ భయంతో కోళ్ల పేరు చెబితేనే జనం భయపడుతున్నారు. కోళ్లు తినడం వల్ల ఎలాంటి భయం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించినా కూడా జనం ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ ధరలు చిక్కిపోయాయి. వారం రోజుల్లో కేజీ ధర రూ.50 మేర పడిపోయింది. అయితే, అక్కడ మాత్రం చికెన్ ధర చుక్కలు చూపిస్తోంది. కేజీ ధర రూ.1000 నుంచి రూ.2000 వరకు పలుకుతోంది. మొత్తం కోడిని తీసుకోవాలంటే రూ.3000 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇంతకీ ఇంత రేటు పలికేది ఎక్కడనే కదా. కోడిపందాల బరుల వద్ద. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల కోళ్ల పందాలు వేస్తున్నారు. ఈ పందాల్లో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ఆడుతున్న దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

  కోళ్ల పందెంలో ఓడిన కోడిని కొనేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఒక్కో కోడి కనీసం రూ.3000 ధర పలుకుతోంది. నాసి రకం కోళ్లు అయితే రూ.3000 నుంచి రూ.4000 వరకు ఉంది. అదే, మంచి జాతి పుంజు అయితే, రూ.8వేల నుంచి రూ.10వేలకు అమ్ముతున్నారు. పందెంలో దిగే కోడి అంటే పడిచచ్చే అభిమానులు చాలా మంది ఉంటారు. దాని రుచి వేరుగా ఉంటుంది. కోళ్ల పందాల కోసం పుంజులను పెంచేవాళ్లు మంచి ఆహారాన్ని అందిస్తారు. పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు లాంటి మంచి పౌష్టికాహారం అందిస్తారు. అలాగే, వ్యాయామం చేయిస్తారు. మంచి దిట్టంగా పెరిగే పుంజులు కావడంతో వాటికి రేటు పలుకుతుంది. బాదం పప్పు, పిస్తా పప్పులు తిన్న కోడి టేస్ట్ కూడా అదే రేంజ్‌లో అదిరిపోతుందనే అభిప్రాయంతో చికెన్ ప్రియులు డబ్బులకు వెనుకాడకుండా పందెంలో ఓడిన కోళ్లను కొనేందుకు ప్రయత్నిస్తారు.

  పందాలకు సిద్ధంగా ఉన్న కోళ్లు (Image: Special arrangement)


  కోడి పందాలు జరిగే సమయంలో కొన్ని రూల్స్ కూడా పెట్టుకుంటారు. కొందరు పందెం వరకు మాత్రమే పెడతారు. గెలిచినా, ఓడినా ఎవరి కోడి వారు తీసుకుంటారు. కొందరైతే ఓడిన పుంజును గెలిచిన వారికి ఇచ్చేసి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇలా రకరకాలైన పందేలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇలాంటి హడావిడి ఉంటుంది. ఇప్పటికే భోగి, సంక్రాంతి అయిపోయాయి. ఇక మూడో రోజు కనుమ నాడు పందేల హడావిడి ఎక్కువ ఉంటుంది. కనుప మండుగ రోజు ప్రతి ఇంట్లోనూ మాంసం వండుతారు. కాబట్టి, కనుమ రోజు కొట్టే కోడి ధర ఇంకా ఎక్కువ రేటు పలుకుతూ ఉంటుంది.

  పందెంలో చచ్చిన కోళ్లను అక్కడికక్కడే కాల్చి రెడీ చేయడం (Image: Special arrangement)


  కోడి పందాల బరులకు దగ్గర్లోనే మరో వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. పందెంలో చచ్చిన కోళ్లను వెంటనే అక్కడికక్కడే కాల్చి ఇచ్చేవారు కూడా సిద్ధమయ్యారు. కోళ్లను చక్కగా నిప్పుల మీద కాల్చి.. దాన్ని మొత్తం క్లీన్ చేసి ఇస్తారు. చక్కడా అక్కడే కోళ్లను కాల్చుకుని ఇంటికి తీసుకుని వెళ్లి వండుకుని తినడమే.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: