హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

జగన్ కోసం తిరుమల సంప్రదాయాన్ని మారుస్తారా? చంద్రబాబు ఆగ్రహం

జగన్ కోసం తిరుమల సంప్రదాయాన్ని మారుస్తారా? చంద్రబాబు ఆగ్రహం

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఒక నమ్మకం లేని వ్యక్తి కోసం అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారమంటూ.. జగన్‌ కోసమే ఇదంతా చేశారని పరోక్ష్యంగా వ్యాఖ్యానించారు చంద్రబాబు.

ఏపీలో ఆలయాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అంతర్వేదిలో రథం దగ్ధం, ఇంద్రకీలాద్రిలో వెండి సింహాల మాయం వివాదాలను మరవక ముందే తిరుమల కేంద్రంగా మరో రచ్చ మొదలయింది. తిరుమలపైకి ఏ మతస్థులైనా వెళ్లవచ్చని.. శ్రీవారి దర్శనానికి ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేదన్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఉన్నఫలంగా సంప్రదాయాలను మార్చాల్సిన అవసరం ఏంటని నిలదీశాయి. తిరుమల ప్రతిష్టను దిగజార్చేందుకే అడ్డుగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం టీటీడీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఒక నమ్మకం లేని వ్యక్తి కోసం అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారమంటూ.. జగన్‌ కోసమే ఇదంతా చేశారని పరోక్ష్యంగా వ్యాఖ్యానించారు చంద్రబాబు.

''మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమే. "ఏషః ధర్మః సనాతనః" అన్నారు వాల్మీకి. సనాతనం అంటే ప్రాచీనమైన, నిత్యమైన, ఏ నాటికీ మారని శాశ్వత ధర్మం. అలాంటి ధర్మ, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవు. అలా మార్చాలనుకోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. అసలు మతం అంటేనే నమ్మకం. ఎవరైనా సరే స్వామిపై నమ్మకంతో రావడం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని పెట్టారు. ఒక నమ్మకంలేని వ్యక్తి కోసం అనాదిగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారం, సమాజానికే అరిష్ఠం. అది ఆధ్యాత్మిక ద్రోహం.'' అని ట్విటర్‌లో పేర్కొన్నారు చంద్రబాబు.


తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఏ మతానికి చెందిన వారైనా రావచ్చని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అందుకోసం ఎలాంటి డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం లేదని శుక్రవారం స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతో వస్తే చాలు.. ఏ మతస్థులైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు. గతంలో కూడా టీటీడీకి ఎవరూ డిక్లరేషన్‌ ఇచ్చిన సందర్భాలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకుని వెళ్తున్నారన్న ఆయన.. వాళ్లందరి మతాలను గుర్తించి మనం డిక్లరేషన్‌ అడుగుతున్నామా అని అన్నారు. చంద్రబాబు నాయుడు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు వైవీ సుబ్బారెడ్డి. ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల సహా రాష్ట్రంలో ఎక్కడా అన్యమత ప్రచారాలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలు ఇవాళ్టి నుంచే ప్రారంభవుతున్నాయి. కరోనా కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంలో జరుగనున్నాయి. శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఏకాంతంగానే జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల బ్రహోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 23న సీఎం హోదాలో గరుఢ సేవలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఐతే సీఎం జగన్ కోసమే అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ నిర్ణయం తీసుకుంది విపక్షాలు మండిపడుతున్నాయి.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Tirumala news, Tirumala Temple, Tirupati

ఉత్తమ కథలు