అమరావతిలో కియా ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించిన చంద్రబాబు

కియా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అమరావతికి వచ్చే అతిథుల కోసం ఈ ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తారు.

news18-telugu
Updated: December 6, 2018, 12:48 PM IST
అమరావతిలో కియా ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించిన చంద్రబాబు
కియా మోటార్స్ అందించిన ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభిస్తున్న చంద్రబాబునాయుడు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కియా మోటార్స్ ప్రారంభించిన ఎలక్ట్రిక్ కార్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో కార్ల తయారీ ప్లాంట్ పెట్టిన కియా మోటార్స్.. మూడు ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చింది. అత్యంత ఆధునిక వాహనాలైన నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ మూడు కార్లతో పాటు అమరావతిలో కార్ల ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం - కియా మోటార్స్ మధ్య ‘రాబోయే తరం పర్యావరణ రవాణా’ (నెక్ట్స్ జనరేషన్ ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్)పై అవగాహన ఒప్పందం కుదిరింది.

కియా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వాటిని చార్జింగ్ చేయడానికి ఆల్టర్నేటివ్ చార్జింగ్ (ఏసీ) ద్వారా ఎనిమిది గంటలు పడుతుంది. డైరెక్ట్ కరెంట్ (డీసీ) ద్వారా 45 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. అమరావతికి వచ్చే అతిథుల కోసం ఈ ఎలక్ట్రిక్ కార్లను వినియోగిస్తారు. గన్నవరం - అమరావతి మధ్య ఈ ఎలక్ట్రిక్ కార్లు చక్కర్లు కొడతాయి. విజయవాడలో కూడా చార్జింగ్ స్టేషన్‌ను కియా మోటార్స్ ఏర్పాటు చేసింది.

ఏపీ ప్రభుత్వానికి కియా మోటార్స్ అందించిన ఎలక్ట్రిక్ కార్లు
ఏపీ ప్రభుత్వానికి కియా మోటార్స్ అందించిన ఎలక్ట్రిక్ కార్లు


ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించడం ఓ మైలురాయి అని చంద్రబాబు అన్నారు. జనవరిలో కియా మోటార్స్ మొదటి కారు మార్కెట్లోకి వస్తుందని చెప్పారు. ఏడాదిన్నరలోనే మార్కెట్లోకి మొదటికారు తీసుకువస్తుందంటే కియా మోటార్స్ ఎంత స్పీడ్‌గా పనిచేస్తుందో తెలుస్తోందని అభినందించారు. కియా మోటార్స్ ఏపీకి బెస్ట్ ఫ్రెండ్ అన్న చంద్రబాబు దక్షిణ కొరియాలో కియానే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు.అనంతపురంలో కియామోటార్స్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఏటా 3 లక్షల కార్లను తయారు చేయనుంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 11వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తొలుత ఏపీలోని స్మార్ట్ సిటీల్లో పర్యావరణహితమైన ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు