గ్యాస్ లీక్ కారణంగా ఇప్పటి వరకు 12 మందిని పొట్టన పెట్టుకున్న విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసేయాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. గ్యాస్ లీక్ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన కంపెనీ యాజమాన్యంపై ఇప్పటి వరకు కేసులు మాత్రమే పెట్టారని, దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్ వైఖరి, ఆయన మాటలు చూస్తుంటే, ఇలాంటి ఘటనలను తేలిగ్గా తీసుకుంటున్నట్టు ఉందని చంద్రబాబు అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను హైకోర్టు, ఎన్జీటీ, ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకున్న విషయాలను గుర్తు చేసిన చంద్రబాబు... దీనిపై ఆయా రంగాల నిపుణులు మాత్రమే విచారణ చేయాలన్నారు. అలాగే, స్టైరిన్ గ్యాస్ వల్ల ఏర్పడే దీర్ఘకాల సమస్యల గురించి కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు అత్యవసరం కిందకు రాని పరిశ్రమకు ఓపెన్ చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశానని, అనుమతి వచ్చిన తర్వాత వైజాగ్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తానని చెప్పారు.
‘ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను మూసేయాలి. తక్షణం అక్కడి నుంచి తరలించాలి. పరిశ్రమ మీద ఐఏఎస్ అధికారుల కమిటీ ఏం చేస్తుంది. నిపుణుల కమిటీతో విచారణ జరపాలి. విశాఖ ప్రమాదాన్ని జగన్ తేలికగా తీసుకుంటున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం సరిపోతుందా? రూ.కోటితో చనిపోయిన వారిని తీసుకురాగలరా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై టీడీపీ తరఫున ఓ త్రిసభ్య కమిటీని వేశామని, ఆ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత తాము దీనిపై ముందుకు వెళ్తామన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.