HOME »NEWS »ANDHRA PRADESH »centre wrote letter to cm kcr and ys jagan to submit dpr for projects in telangana and andhra pradesh ak

KCR-YS Jagan: కేసీఆర్, జగన్‌లకు కేంద్రమంత్రి లేఖ.. ఎందుకంటే..

KCR-YS Jagan: కేసీఆర్, జగన్‌లకు కేంద్రమంత్రి లేఖ.. ఎందుకంటే..
కేసీఆర్, వైఎస్ జగన్

AP Telangana: గత ఏడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా డీపీఆర్‌లు అందివ్వాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు.

  • Share this:
    ఏపీ, తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్(డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లు వెంటనే సమర్పించాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. గత ఏడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా డీపీఆర్‌లు అందివ్వాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. కృష్ణాపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ ఇవ్వాలన్నారు. డీపీఆర్‌లు సహా అన్ని రకాల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

    అయితే ఇప్పటివరకు తెలంగాణ నుంచి ఒక్క డీపీఆర్‌ కూడా రాలేదని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతలపై నిబంధనల మేరకు డీపీఆర్‌ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించారు. పట్టిసీమ 3వ దశ డీపీఆర్‌ ఇవ్వాలని గోదావరి బోర్డును కోరారు. పురుషోత్తమపురం మినహా దేనికీ డీపీఆర్‌ ఇవ్వలేదన్నారు. కృష్ణాపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని.. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు, ఇతర వివరాలు ఇస్తేనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.



    గతేడాది ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంతో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్ట్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఆరోపించింది. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తెలంగాణ వాదనను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలంగాణలోనూ అనుమతులు లేకుండా గోదావరి నదిపై అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైంది. అనుమతులు లేని కొత్త ప్రాజెక్టులను నిర్మించవద్దని.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి డీపీఆర్‌లు సమర్పించాలని ఆదేశించింది. అందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి డీపీఆర్‌లు ఇవ్వకపోవడంతో.. మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:January 16, 2021, 17:34 IST