news18-telugu
Updated: February 27, 2019, 8:10 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో ప్రత్యేక హోదా తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన విశాఖ రైల్వే జోన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత విశాఖకు రైల్వే జోన్ ప్రకటిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలుపుకుని విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేను ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మార్చి 1న ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు రానున్న సందర్భంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించడానికి ప్రధాన సమస్యగా ఉన్న వాల్తేరు డివిజన్ వ్యవహారానికి ఒక పరిష్కారం చూసిన తరువాతే... కొత్త జోన్ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్‌కి రైల్వే జోన్ ఇచ్చిన తమకు అభ్యంతరం లేదని చెబుతూ వచ్చిన ఒడిశా... తమ రాష్ట్రానికి చెందిన తూర్పుకోస్తా రైల్వేలో భాగమైన వాల్తేరు డివిజన్ విభజన మాత్రం తమ ఆమోదం లేకుండా చేయకూడదని మెలిక పెడుతూ వచ్చింది. తూర్పుకోస్తా రైల్వేకి వాల్తేరు డివిజన్ ప్రధాన ఆదాయవనరుగా ఉంటూ వస్తోంది. ఈ తరుణంలో వాల్తేరు డివిజన్‌ను ఏపీకి కేటాయిస్తే, తూర్పుకోస్తా జోన్ నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉందన్నది ఒడిశా ఆందోళన. దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే రైల్వే డివిజన్లలో వాల్తేరు మూడో స్థానంలో ఉండటం గమనార్హం.
ఆగ్నేయ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను 2003లో విడదీసి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేశారు. ఒడిశాలోని ఖుర్దారోడ్తో పాటు ఏపీలోని వాల్తేరు, ఇంకో రాష్ట్రంలోని సంబల్పూర్ డివిజన్లతో కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాల్తేరు డివిజన్లో భాగంగా ఉన్న జగదల్పూర్, కిరండూల్, కోరాపుట్, నవరంగ్‌పూర్ ప్రాంతాలను విడదీసి తాము మూడేళ్లుగా అడుగుతున్న రూర్కెలా, జైపూర్, రాయగడ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని ఒడిశా డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో... మరో భాగాన్ని ఒడిశాలోని రాయగఢ కేంద్రంగా ఒక డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో... విశాఖ రైల్వే జోన్‌కు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.
First published:
February 27, 2019, 8:10 PM IST