భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను సోమవారం కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాదికి గాను పద్మ విభూషణ్-7 , పద్మభూషణ్-10 , పద్మ శ్రీ-102 ఇలా మొత్తం 119 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. మరో ప్రముఖ గాయిని కే.ఎస్ చిత్రకు ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం నలుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలో ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఏపీకి చెందిన అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ (Arts), ఏపీకి కి చెందిన అశావాది ప్రకాశ్‌రావుకు పద్మశ్రీ (Literature), ఏపీకి చెందిన నిడుమోలు సుమతికి పద్మశ్రీ (Arts), తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మశ్రీ(Arts) పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.
కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్, మాజీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, గుజరాత్ బీజేపీ నేత కేశూభాయ్ కు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. వీరితో పాటు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మ విభూషణ్ ను కేంద్రం ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ మొనప్ప హెగ్డేకు, అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపానీకి, ఢిల్లీకి చెందిన మౌలానా వహీదుద్దీన్ ఖాన్‌కు, బీబీ లాల్‌కు, ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహూ తదితరులకు పద్మ విభూషణ్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ మాసాల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ అత్యున్నత పౌరపురస్కారాలను ప్రదానం చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.