ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విభజన హామీల్లో ప్రధానమైన విశాఖపట్నం రైల్వే జోన్ (Visakhapatnam Railway Zone) అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అలాగే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు డీపీఆర్ పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ తో పాటు రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21 బడ్జెట్ లో రూ.170 కోట్లు కేటాయించామన్నారు. రైల్వో జోన్, రైల్వే డివిజన్ పరిధితో పాటు పలు అంశాలు తమ దృష్టకి వచ్చాయని.. ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ముందస్తు కసరత్తు, ప్రణాళికలు చెపట్టాల్సిందిగా వైజాగ్ లోని సౌత్ కోస్టల్ రైల్వే ఓఎస్టీకి ఇప్పటికే నిర్దేశించామన్న రైల్వే మంత్రి.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రధాన హెడ్ ఆఫీస్ భవనాలు నిర్మాణానికి భూమి కూడా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి భూ సర్వే, ఆఫీస్ లే అవుట్, సిబ్బంది క్వార్టర్స్, ఇతర నిర్మాణ పనులకు సంబంధించిన కార్యకలాపాలు మొదలుపెట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపింది.
రైల్వే జోన్ ఏర్పాటులో అడ్మినిస్ట్రేటివ్, మేనేజ్ మెంట్ అవసరాలతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతో రైల్వే జోన్ ఏర్పాటు, దాని పరిధిపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేను విభచింది.. వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటవుతుందని.. అలాగే వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా డివిజన్ ఏర్పాటుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రైల్వే మంత్రి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల పైనా కేంద్రం స్పష్టతనిచ్చింది. కడప-బెంగుళూరు రైల్వేలైన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తన వాటా డిపాజిట్ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపింది. ఇక 2013-14లో రూ.110 కోట్లతో మంజూరుచేసిన కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపులను తాజాగా రూ.560.72 కోట్లకు పెంచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుకు రూ.178.35 కోట్లు కేటాయించగా.. రూ.171.2 కోట్లన కేంద్రం ఖర్చు చేసినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.