వైఎస్ వివేకా హత్య కేసును విచారణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సీబీఐ బృందం పలువురు అనుమానితుల స్టేట్మెంట్లను పరిశీలించింది. సిట్ విచారించిన అనుమానితుల విచారణ స్టేట్మెంట్స్ ఆంగ్లంలో తర్జుమా చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక పలువురు అనుమానితులను విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె ఆరోపిస్తున్న 15 మంది స్టేట్మెంట్స్పై సీబీఐ దృష్టి సారించినట్టు సమాచారం. అంతకుముందు పులివెందులలోని వైఎస్ వివేకా నివాసంలో సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీతో 3 గంటలకు పైగా మాట్లాడారు. హత్య జరిగిన వివేకానంద రెడ్డి బెడ్రూమ్, మృతదేహం లభ్యమైన బాత్రూమ్లోనూ క్షుణ్ణంగా పరిశీలించారు.
2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇంట్లోనే ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు, ఇతర గాయాలు కనిపించాయి. మాజీ సీఎం తమ్ముడు, ఓ రాజకీయ పార్టీ అధినేత అయిన జగన్ మోహన్ రెడ్డికి బాబాయి, స్వయానా మాజీ మంత్రి కూడా అయిన వైఎస్ వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ఐతే సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం జగన్ డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే అధికారంలోకి వచ్చాక హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
ఐతే సీబీఐ విచారణ చేయాలని వివేకా కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. హత్య కేసుగా నమోదు చేయాలని, దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో మరికొందరు టీడీపీ నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపితే తమను అన్యాయంగా ఇరికించే అవకాశం ఉందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు వివేకా కుటుంబ సభ్యులను అడిగి కేసుపై వివరాలను తెలుసుకున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.