ఇటీవల రిలీజ్ అయిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భీమ్లా నాయక్ సినిమా (Bheemla Nayak Movie) బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ రిలీజ్ టైమ్ లో అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతించకపోయినా, టికెట్ ధరల విషయంలో కఠినంగా ఉన్నా అభిమానులు మాత్రం థియేటర్లకు పోటెత్తారు. కొన్నిచోట్ల పవన్ ఫ్యాన్స్ చూపిన అత్యుత్సాహం వివాదాస్పద మైంది. అంతేకాదు ఎకంగా పోలీస్ కేస్ నమోదు చేసేవరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా (Chittoor District) పీలేరులోని సీఎస్ఎన్ థియేటర్ లో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏకంగా గొర్రెను బలిచ్చారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికుడు, న్యాయవాది అయిన అసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన అసర్.. సోషల్ మీడియాలో వీడియోలు చూసి ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రూయల్టీ, బర్డ్స్ ఆర్మ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సీఎస్ఎన్ థియేటర్ యాజాన్యాన్ని కూడా చేర్చారు. వీడియోల ఆధారంగా పవన్ ఫ్యాన్స్ ను గుర్తించేప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భీమ్లా నాయక్ రిలీజ్ సందర్భంగా అభిమానులు చేసిన సందడి కొన్నిచోట్ల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో ఓ ప్రేక్షకుడి అత్యుత్సాహంతో స్క్రీన్ చిరిగిపోయింది. అలాగే కడప ఓ థియేటర్లో సౌండ్ సిస్టమ్ నిలిచిపోవడంతో అభిమానులు ఆగ్రహంతో కుర్చీలు ధ్వంసం చేయడం విమర్శలకు దారితీసింది. తాజాగా పీలేరులో జంతుబలి ఇవ్వడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. పవన్ ఫ్యాన్స్ ను అరెస్ట్ చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ రిలీజ్ సందర్భంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అదనపు షోలకు అనుమతివ్వకపోవడంతో అభిమానులు థియేటర్ల వద్ద ఆందోళనలకు దిగారు. గుంటూరు జిల్లాలో విడుదల రోజే థియేటర్ సీజ్ చేయడంతో ఏకంగా రాస్తారోకోకు దిగారు. అలాగే గుడివాడలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను పవన్ అభిమానులు అడ్డుకున్నారు.
మరోవైపు గుంటూరు జిల్లాలో భీమ్లా నాయక్ సినిమాపై కేసు కూడా నమోదైంది. సినిమా క్లైమాక్స్ ఫైటింగ్ లో రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నిన సన్నివేసం తమ మనోభావాలు దెబ్బతీసిందంటూ శాలివాహన కుమ్మరి సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్ తో పాటు సినిమా డైరెక్టర్, నిర్మాత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.