కొందరికి తీరని కోరికలు, ఆశలు, లక్ష్యాలుంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు జీవితాంతం కష్టపడతారు. కానీ చిన్నవయసులోనే ప్రమాదకర వ్యాధుల బారిన పడిన వారు తమ లక్ష్యాలను చేరుకోలేదని నిత్యం బాధపడుతుంటారు. మృత్యువు చేరువవుతున్న కొద్దీ లక్ష్యాలను చేరుకోలేదనే మనోవేదన వారిని వేధిస్తుంటుంది. అలాంటి వారి కోరికలు చిన్నచిన్న ప్రయత్నాలు, సామాజిక బాధ్యతల ద్వారా నెరవేరుతుంటాయి. భయంకరమైన క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఓ బాలుడి కలను గుంటూరు పోలీసులు నిజం చేశారు. అతడి లక్ష్యాన్ని నెరవేర్చి బాలుడి కళ్లలో సంతోషాన్ని నింపారు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు బాధ్యతలు స్వీకరించాడు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్వయంగా బాలుడికి ఛార్జ్ అప్పగించారు. గుంటూరుకు చెందిన నోయల్ చాంద్, బీబీ నూర్జహాన్ దంపతుల కుమారుడు రిహాన్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.
ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతోంది. పోలీస్ కావడం రిహాన్ కల కావడంతో తల్లిదండ్రులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని సమాచారమిచ్చారు. దీనిపై స్పందించిన ఆయన.. రిహాన్ కు ఒక రోజు ఎస్పీగా బాధ్యతలు అప్పగించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఎస్పీ ఆఫీస్ కు చేరుకున్న రిహాన్ కు స్వాగతం పలికిన అమ్మిరెడ్డి.. స్వయంగా తన ఛాంబర్ కు తీసుకెళ్లి బాధ్యతలు అప్పగించారు.
తన చిరకాల కోరిక నెరవేరినందుకు రిహాన్ సంతోషించాడు. బాలుడి కళ్లలో ఆనందం చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. గతంలో కూడా చాలా సార్లు మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి చిన్నారులను ఒకరోజు ఉన్నతాధికారులుగా చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలుసార్లు భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్న చిన్నారులకు ఒకరోజు కమిషనర్ అవకాశాలు కల్పించారు.
ఇక బాలికల దినోత్సవం రోజున అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.. కస్తుర్భా గాంధీ పాఠశాలలో చదువుతున్న బాలికకు ఒక రోజు కలెక్టర్ గా అవకాశమిచ్చారు. అదే రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పదవుల్లోనే బాలికలనే కూర్చోబెట్టి శభాష్ అనిపించుకున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.