నివర్ తుపాను మిగిల్చిన నష్టం మరువకముందే మరో తుపాను ఏపీలోని పలు జిల్లాల ప్రజలను భయడపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మరింతగా బలపడుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది మరింతగా బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు బురేవి అని పేరు పెట్టారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సుమారు డిసెంబర్ రెండో తేది సాయంత్రం శ్రీలంక మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
దీని ప్రభావం వల్ల రానున్న 36 గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక నివర్ తుపాను కారణంగా ఏపీలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రంలోని పది జిల్లాలు నివర్ తుపాను తాకిడికి అతలాకుతలం అయిపోయాయి. తుపాను ప్రభావంతో కురిసిన భారీగా వర్షాలతో పంటలు నీట మునిగి పోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలు తీవ్రంగా ఈ నివర్ తుపానుకు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇక కృష్ణా, గుంటూరు, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై కూడా భారీ ప్రభావాన్ని చూపించింది నివర్. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 126 మండలాకు గాను..105 మండలాల్లోని 973 గ్రామాల్ని జలమయం చేసింది. ఆ ప్రాంతాల్లో 1,400 కి.మీ పైగా రహదారులు దెబ్బతిన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, WEATHER