BRANDIX GAS LEAKAGE ISSUE VICTIMS TREAT MENT IN GOVERNMENT HOSPITAL BUT NO POWER NGS VSP
Power Problems: ఆస్పత్రులకు తప్పని విద్యుత్ కోతలు.. అంధకారంలోనే బ్రాండిక్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు చికిత్స
అంధకారంలో బ్రాండిక్స్ బాధితులకు చికిత్స
Power Problems: ఆంధ్రప్రదేశ్ ను విద్యుత్ సమస్యలు వీడడం లేదు. ముఖ్యంగా ఆస్పత్రులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఆ మధ్య టార్చ్ లైట్ల వెలుగులో ఓ మహిళ ఆస్పత్రిలో ప్రసవించిన సంగతి మరిచిపోక ముందే.. అనకాపల్లి ఆస్పత్రిలో మరో సమస్య తెరపైకి వచ్చింది. బ్రాండిక్స్ బాధితులంతా అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Power Problems: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ సమస్యలకు ఇప్పట్లో చెక్ పడే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా ఆస్పత్రులపై ఈ ప్రభావం అధికంగా పడడం కలకలం రేపుతోంది. తాజాగా అనకాపల్లి (Anakapalli) ఆస్పత్రి వ్యవస్థలో అదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యుత్ సమస్యకు తోడు.. అధికారుల నిర్లక్ష్యంతో ఆస్పత్రి అంధకారంలోకి వెళ్లింది. ప్రస్తుతం అక్కడ బ్రాండిక్స్ (Brandix) బాధితులు చికిత్స పొందుతున్నారు. దీంతో విద్యుత్ లేక వారంతా నానా అవస్థలు పడుతున్నారు. కరెంట్ పోయిన తరువాత జనరేటర్ ఆన్ అవ్వకపోవడంతో ఆస్పత్రిలో చీకట్లు నెలకన్నాయి. అయితే జనరేటర్ పని చేయకపోవడానికి డీజిల్ లేకపోవడమే కారణం అని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు అవకాశం ఇస్తోంది. గతంలో అనుభవాల ప్రకారం అయితే.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి సడెన్ విద్యుత్ సమస్య వస్తే జనరేటర్ ఆన్ చేయడానికి డీజిల్ సిద్ధంగా ఉండాలి.. కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రి (Hospital) అంధకారంలోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పేషేంట్ల బంధువులు ఆస్రపత్రి వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ కంపెనీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో 200 మంది అస్వస్ధతకు గురవ్వటం చాలా బాధాకరం అని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖలో విషవాయువు లీక్ ఘటన ఆందోళనకరం కలిగించిందని ఆయన అన్నారు. గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవటం విచారకరమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవడమే కాకుండా నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మరోవైపు అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారి తీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.