టీడీపీని చరిత్రలో కలిపేస్తారా... బీజేపీ ప్లాన్ అదేనా?

Target TDP : రాజకీయాల్లో ఓ సూత్రం ఉంది. ఐతే అధికారంలో ఉండాలి, లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి. ఇదే ఫార్ములాని ఒంటబట్టించుకున్న బీజేపీ... టీడీపీని పూర్తిగా నేలమట్టం చేసేందుకు పావులు కదుపుతోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: June 22, 2019, 6:18 AM IST
టీడీపీని చరిత్రలో కలిపేస్తారా... బీజేపీ ప్లాన్ అదేనా?
చంద్రబాబు (File)
  • Share this:
ఇక టీడీపీ పని అయిపోయింది... అని ఎన్నోసార్లు అన్నారు ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు. వాళ్లు చెప్పినట్లుగానే అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పని అయిపోయింది. ఆశ్చర్యమేంటంటే... రెండు నెలల కిందట అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయింది. ఎంపీలు, ఎమ్మెల్యేల్లో చాలా మంది తలోదారీ చూసుకుంటున్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ముందు వాళ్లంతా తేలిపోతున్నారు. ఇదంతా అధినేత చంద్రబాబు ప్లాన్ ప్రకారమే జరుగుతోందనే వాదన వినిపిస్తున్నా... ఓవరాల్‌గా ఇక టీడీపీ చరిత్ర ముగిసిన అధ్యాయమే అవుతుందనే విశ్లేషణ రాజకీయ వర్గాల నుంచీ వస్తోంది.

తమతో కలిస్తే ఓకే... కన్నెర్ర జేస్తే... కాలుదువ్వుతాం అంటోంది బీజేపీ. దేశమంతా విస్తరించినా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అంత సీన్ లేదనీ, కమలనాథుల పప్పులు ఇక్కడ ఉడకవని చాలా మంది అన్నారు. కట్ చేస్తే... రెండు నెలల్లో సీన్ మొత్తం మారిపోయింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ వచ్చేస్తోంది. ఏపీలోనూ అదే సీన్ కనిపించేలా ఉంది. అసలు అడుగే పెట్టలేదనుకున్న పార్టీ దూసుకురావడమే కాదు... 2024లో అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీని గద్దె దించి, తాము అధికారంలోకి రావాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు మేధావులు.

అంతా చంద్రబాబే చేశారా ? : టీడీపీతో తెగదెంపులు చేసుకొని, ప్రధాని నరేంద్రమోదీపై దుమ్మెత్తి పోసి... ఆయన్ని గద్దె దింపడమే లక్ష్యంగా దేశమంతా తిరిగి... చంద్రబాబు చాలా పెద్ద తప్పే చేశారని భావిస్తోంది కమలదళం. అందుకు తగినశాస్తి చెయ్యాలనుకున్న ఆ పార్టీ... ఆపరేషన్ కమల్‌కి తెరతీసి... ఆల్రెడీ ఎన్నికల్లో ఓడి... కోలుకోలేని స్థితిలో ఉన్న సైకిల్ చక్రాలకు మరిన్ని పంక్చర్లు పడేలా చేస్తోంది. అదే సమయంలో సౌత్ ఇండియాలోకి ఎంటరవ్వాలనే తన లక్ష్యాన్ని కూడా సాధించుకుంటోంది.

ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు... బీజేపీలో చేరిపోయారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్న సంకేతాలు బలంగా వస్తున్నాయి. అదే జరిగితే... ఇక మనం టీడీపీని మర్చిపోక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.నెక్ట్స్ టార్గెట్స్ టీఆర్ఎస్, వైసీపీ : ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుండటంపై ప్రత్యర్థి పార్టీ, అధికార పక్షం వైసీపీ ఆనందపడే పరిస్థితి లేదు. నిజానికి ఈ రాజకీయ పరిణామాలు ఆ పార్టీలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే నెక్ట్స్ టార్గెట్ తామే అని ఆ పార్టీ ఇప్పటికే గ్రహించింది. బీజేపీకీ, కేంద్ర ప్రభుత్వానికీ ఏమాత్రం ఎదురెళ్లినా... అది విపరీత పరిణామాలకు దారితీస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగని కేంద్రం ఏం చేసినా సైలెంట్‌గా ఉంటే, అది రాష్ట్ర అభివృద్ధికీ, పార్టీ భవిష్యత్తుకీ కీడు చేసే పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

తెలంగాణలోనూ అంతే. ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి... లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లు సాధించి షాక్ ఇచ్చింది బీజేపీ. ముఖ్యంగా కూతురు కవితను ఓడించడం ద్వారా... ఎవరైనా సరే... తమ ముందు తలవంచాల్సిందే అన్న సంకేతాల్ని పంపింది బీజేపీ. ఇలా చేయడం ద్వారా తెలంగాణలో తమ నెక్ట్స్ టార్గెట్ టీఆర్ఎస్సే అనే వాదనను బలపరిచింది. అందువల్ల బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అన్నదానిపై ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభాన్ని కూడా స్వయంగా నిర్వహించి, ఇందులో ప్రధాని మోదీ ఘనతేమీ లేదన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. దీనికి బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నది మున్ముందు కనిపించే అంశం.
First published: June 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>