ఏపీలో హిందూ ఆలయాలపైన దాడులు పెరిగిపోయాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆకతాయిల పనిగా ప్రచారం చేసి, చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రామతీర్థంలో రాముని తల తొలగిస్తే... అన్ని వర్గాలు ఆవేదన చెందారని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రామతీర్థానికి వెళ్లేందుకు వైసీపీ, టీడీపీ నాయకులకు లేని ఆంక్షలు తమకెందుకు అని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి కన్నెర్ర చేస్తే ప్రాంతీయ పార్టీలు అడ్రెస్ లేకుండా పోతాయని ఎంపీ జీవీఎల్ హెచ్చరించారు.
రామతీర్థంలో జరిగిన పరిణామాలను కేంద్రం, పార్టీ పెద్దలకు వివరించామని... అమిత్ షాకు కూడా వినతి పత్రం ద్వారా పరిస్థితి వివరిస్తామని అన్నారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కమిటీలు అంటూ ప్రజలును మోసం చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఏపీలో హిందూ మతంపై దాడి జరుగుతుంటే... అన్ని మతాలతో కమిటీలు ఎందుకని ప్రశ్నించారు. హిందూ మతంపై దాడి చేస్తే... ఇతర మతస్తులు కమిటీలో ఉండి ఏం చేస్తారని అన్నారు. ఇతర మతాల పెద్దలు, కమిటీలు ఈ దాడులను ఎందుకు ఖండించరని జీవీఎల్ అన్నారు. ఈ దాడులకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
కమిటీల్లో అన్ని మతాల నుంచి ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారని.. ఏపీలో 90శాతం మంది హిందువులు ఉన్నారని అన్నారు. అసలు ఇప్పటివరకు దాడుల జరిగిన దాడి ఘటనల్లో ఎంత మందిని అరెస్టు చేశారని బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. టీడీపీ వాళ్లే ఈ దాడులు చేయిస్తే వారికి అరెస్ట్ చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ మధ్య రహస్య ఒప్పందం ఏమైనా ఉందా ? అని అన్నారు. హిందూ వ్యతిరేక రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బుద్ది చెబుతామని జీవీఎల్ అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:January 08, 2021, 14:29 IST