ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన తరపున ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనే విషయంపై క్లారిటీ రానుంది. త్వరలోనే జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే తిరుపతి ఉప ఎన్నిక కూడా జరగనుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇక్కడ ఆ రెండు పార్టీల తరపున ఎవరు బరిలో ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీడీపీ తరపున కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ బరిలోకి దిగడం ఖాయం కాగా.. వైసీపీ తరపున గురుమూర్తి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ, జనసేన కూటమి తరపున ఎవరు బరిలో ఉంటారనే విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. మార్చి మొదటి వారంలోనే దీనిపై క్లారిటీ వస్తుందని ఢిల్లీ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే ఇంకా దీనిపై అటు బీజేపీ, ఇటు జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమ పార్టీకి చెందిన అభ్యర్థిని జనసేన మద్దతుతో బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం.
త్వరలోనే ఇందుకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఇందుకు సంంధించి చర్చలు జరిపారని.. తిరుపతి సీటును బీజేపీకి వదిలేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారని సమాచారం. నిజానికి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది. ఈ విషయంలో బీజేపీ కంటే జనసేన చాలా ముందుంది. దీంతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ జనసేన బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉందని వార్తలు వచ్చాయి. దీనికితోడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం ఏపీలో బీజేపీకి ప్రతికూలంగా ఉందని.. ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని ఆ పార్టీ వర్గాలు భావించాయి.
కానీ బీజేపీ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఆలోచిస్తోందని.. తిరుపతి నుంచి కచ్చితంగా తమ పార్టీ పోటీలో ఉండాలని భావించింది. ఇందుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఒప్పించి.. ఆ పార్టీ మద్దతుతోనే బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందుకు జనసేన కూడా అంగీకరించడంతో కమలం పార్టీకి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆందోళనల నేపథ్యంలో.. బీజేపీ ప్రజలను మెప్పించి మెరుగైన ఫలితాలు సాధించడం అంత సులువు కాదనే వార్తలు వినిపిస్తున్నాియి. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ ఎలాంటి ఫలితాలను చవిచూస్తుందన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena, Pawan kalyan, Tirupati Loksabha by-poll