news18-telugu
Updated: November 13, 2020, 10:53 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త ఇన్ చార్జిలను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రాల ఇన్ చార్జిల పేర్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జిగా మురళీధరన్‌ను నియమించారు. ప్రస్తుత ఇన్ చార్జి సునీల్ దియోధర్‌కు సహ ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ బీజేపీ ఇన్ చార్జిగా తరుణ్ చుగ్‌కు బాధ్యతలు అప్పగించింది. తరుణ్ చుగ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఢిల్లీకి సహ ఇన్ చార్జి, అండమాన్ నికోబార్ దీవులకు ఇన్ చార్జి, బేటీ బచావ్, బేటీ పడావ్ కార్యక్రమానికి జాతీయ సహ సమన్వయ కర్తగా ఉన్నారు. తరుణ్ చుగ్‌కు జమ్మూకాశ్మీర్, లేహ్ ఇన్ చార్జి బాధ్యతలను కొనసాగిస్తూనే తెలంగాణ ఇన్ చార్జిగా కూడా నియమించారు. ఆయన పంజాబ్‌కు చెందిన నేత. ఏపీ బీజేపీ ఇన్ చార్జిగా నియమితులైన వి.మురళీధరన్ కేరళకు చెందిన నేత. ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. 2018లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010 - 15 మధ్య కేరళ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిని ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ చార్జిగా నియమితులయ్యారు. సెప్టెంబర్ 26న బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాల నేతలకు ప్రమోషన్ ఇచ్చింది. పలువురు కొత్త వారికి అందులో చోటు కల్పించింది. తెలంగాణకు చెందిన డీకే అరుణ, ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టింది. డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో పురందేశ్వరికి చోటు కల్పించింది. ఇప్పుడు మళ్లీ పురందేశ్వరికి రెండు రాష్ట్రాల ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించడం విశేషం.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడానికి పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల గెలుపుతో రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలను మరింత సీరియస్‌గా తీసుకుని బరిలోకి దిగనుంది. ఇలాంటి సమయంలో కొత్త ఇన్ చార్జి రావడం, అది కూడా జమ్మూకాశ్మీర్ , లేహ్ లాంటి క్రియాశీలకమైన కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్ చార్జిగా ఉన్న తరుణ్ చుగ్‌కు పగ్గాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 13, 2020, 10:13 PM IST