Free Ration Shock: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఫ్రీ రేషన్ విషయంలో చేతులు ఎత్తేస్తోందా..? మరోవైపు కొత్తగా ప్రారంభించాలి అనుకున్న పథకానికి కూడా బ్రేకులు పడినట్టేనా..? సాధారణంగా ఏదైనా పథకాన్ని సీఎం జగన్ (CM Jagan) ప్రారంభించాలి అనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే వెళ్తారు.. కానీ ఇప్పుడు ఫ్రీ రేషన్, బియ్యానికి నగదు బదిలీ వాయిదా విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసే పరిస్థి కనిపిస్తోంది. రేషన్ బియ్యాని (Ration Rice)కి నగదు బదిలీపై ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు (Karumuri Nageswara Rao)కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టామని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పుడు ఫ్రీ రేషన్ విషయంలో చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల ఇప్పటి వరకు ఫ్రీ రైష్ సరఫరా చేయలేదు.
ఉచిత రైసు కావడంతో కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ ఎప్పుడొస్తుందా అని లబ్ధిదారులు ఎదురుచూస్తుంటారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ రేషన్ ను నిలిపివేయాలని చూస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఆహార భద్రత చట్టంలో భాగంగా కేవలం సగం రేషన్ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచిత రేషన్ అందిస్తోంది. అయితే మిగతా సగం కార్డులకు ఏపీ ప్రభుత్వమే ఫ్రీ రేషన్ సర్దుబాటు చేస్తోంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుందన్న ఆందోళన జగన్ సర్కారులో ఉంది. అందుకే ఎలాగోలా బియ్యం అందించి నెట్టుకొస్తోంది. ఇలా సర్దుబాటు చేసే క్రమంలో నెలనెలా ఫ్రీ రేషన్ సక్రమంగా అందించలేకపోతోందనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా చూసుకుంటే.. ఏప్రిల్ నెలకు సంబంధించి జగన్ సర్కారు చేతులెత్తేసింది. మాసాంతానికి మూడు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో రేషన్ అందించలేమని అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే నెలలో రెండు నెలల రేషన్ అందించేందుకు నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ వద్ద నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు లేకపోవడమే దీనికి కారణమని సమాచారం. రెగ్యులర్ కోటాలో సార్టెక్స్ చేసిన బియ్యం ఇస్తోన్న ప్రభుత్వం, ఉచిత కోటాలో మాత్రం నాన్ సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలను మార్చి నెల వరకూ ఇవ్వగా ఈ నెలలో కొరత ఏర్పడింది. వాస్తవానికి కరోనా తగ్గుముఖం పట్టడం, ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగియడంతో ఉచిత కోటా పంపిణీ పొడిగింపు ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
ఇదీచదవండి : స్వామి పాదాలకు మంత్రుల నమస్కారాలు? విడుదల రజనీకి స్వామిజీ ఇచ్చిన కానుక చూశారా?
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఉచిత కోటాను ఒకేసారి ఆరు నెలలు పొడిగించింది. దీంతో ఉచిత కోటాకు సిద్ధంగా లేని రాష్ర్టానికి ఈ నిర్ణయం తలనొప్పిగా మారింది. నాన్ సార్టెక్స్ బియ్యం కావాలని హడావుడిగా ఎఫ్‌సీఐని కోరింది. కానీ, రైతుల ధాన్యం సేకరించే రాష్ర్టాలకు బియ్యం తిరిగి ఇవ్వకూడదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ నెలకు ఉచిత కోటాను రాష్ట్రం వాయిదా వేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Free Ration