BIG SHOCK TO POOR FARMERS THEIR ELECTRICITY BILL MORT THAN ONE LAKH IN ANANTAPURAM NGS TPT
Current Bill: కరెంటే కాదు బిల్లు కూడా షాకిస్తోంది.. సాధారణ కూలీకి లక్షల్లో బిల్లు.. సిబ్బంది సమాధానం విని మైండ్ బ్లాంక్
షాక్ ఇస్తున్న విద్యుత్ బిల్లులు
Electricity Bill Shock: ఓ పేద కూలి రైతుకు కరెంటు బిల్లు ఎంత వస్తుంది. రెండు లైట్లు, ఒక ఫ్యాన్, టీవీ మాత్రమే ఉంటే నెలకు బిల్లు ఎంత రావాలి.. కానీ అనంతపురంలో మాత్రం వారికి లక్షల్లో బిల్లులు ఇస్తున్నారు సిబ్బంది..
Current Bill Shock: అతడో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి.. అందులోనూ వయసు పై బడింది. అయినా కూలికెళ్తే కానీ మూడు పూటల కడుపు నిండదు.. ఫించన్ వస్తే తప్ప సంసారం ముందుకు సాగదు.. ఆ ఇంట్లో కాలక్షేపానికి ఒక టీవీ.. బాగా ఉక్కపెడితే ఓ ఫ్యాన్, చీకటి పడితే వెలుగుకోసం రెండు లైట్లు.. అంతే విద్యుత్ వాడేవి ఇంకేమి ఉండవు. అంటే నిరంతరాయంగా నెల అంతా వదిలేసినా వందల్లోనే కరెంటు బిల్లు (Electricity bill) వస్తుంది. అలాంటి ఓ రైతు (Farmer) కుటుంబానికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు చూసి.. ఆ రైతు లబోదిబోమంటున్నాడు. వందల్లో కాదు.. పోనీ వేలల్లో కూడా కాదు.. ఏకంగా లక్షల్లో బిల్లు వచ్చింది. ఎలా చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నాడు ఆ రైతు. ఆయన ఒక్కడికే కాదు ఆ గ్రామం (Village) లో మరికొంతమందికి కూడా ఇదేవిధంగా బిల్లులు వచ్చాయని అంటున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది తప్పిదాలకు తాము ఎందుకు బలి కావాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నా.. విద్యుత్ అధికారులు కళ్లు తెరవడం లేదు. తిరిగి వినియోగదారులుదే తప్పు అన్నట్టు కొందరు బెదిరిస్తుండడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఓ మధ్య తరగతి ఇంటికి కరెంట్ బిల్లు 500 లేదా 600 వరకు వస్తుంది. అదే కూలి పనులకు వెళ్లే ఇంటివారికైతే 200 నుండి 300 రూపాయలు దాటదు. కానీ అనంతపురం జిల్లాలో ఓ పేద కుటుంబానికి ఏకంగా లక్షల్లో విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి ఆ రైతు షాక్కు గురయ్యాడు. హుటాహుటిన విద్యుత్ శాఖ అధికారుల దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నా లాభం లేకుండా పోయింది.
ప్రతినెలా తనకు కరెంటు బిల్లు 200 లేదా 300 వరకు వచ్చేదని.. కానీ 1 లక్ష 48 వేల 371 రూపాయలు వచ్చిందని అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విద్యుత్ శాఖ సిబ్బంది చుట్టూ తిరిగితే 56 వేల 399కు తగ్గించి కట్టాలని చెబుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. అంతా బిల్లు తాను ఎలా చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదే గ్రామంలోని బండయ్య అనే మరో వ్యక్తికి కూడా 78 వేల 167 ఒకసారి.. మరోసారి 16 వేల 251 ఒకసారి వచ్చినట్లు ఆయన తెలిపారు.
సాధారణ కూలి పని చేసి జీవించే తమకు ఇంత భారీగా కరెంట్ బిల్లు వస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద.. పెద్ద అంతస్తులు.. కంపెనీలు ఉన్న వారికి కూడా ఇంత బిల్లు రాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అదే గ్రామంలోని ఐదారు కుటుంబాలకు అధిక కరెంట్ బిల్లులు వచ్చినట్లు తెలిసింది. విద్యుత్ అధికారులు స్పందించి.. మీటర్ బాక్సులలో సమస్యలు ఉంటే పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా.. సాంకేతిక సమస్యల వల్ల లేదా సిబ్బంది బిల్లులు ఇచ్చే సమయంలో రీడింగ్ తప్పుగా నమోదు చేసి ఉంటారని తెలిపారు. మీటర్లో సమస్య ఉంటే సరిచేస్తామన్నారు. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూస్తామన్నారు. అవకాశం ఉంటే వారి బిల్లులో కొంతవరకు తగ్గేంచే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.