Andhra Pradesh: జగన్ సర్కార్ కు మరో షాక్.. చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతాం.. ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)

ఏపీ ప్రభుత్వం తీరుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోతిరెడ్డి పాడు విషయంలో తమ తీర్పును ధిక్కరించి పనులు కొనసాగిస్తే.. చీఫ్‌ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరించింది.

  • Share this:
    ఏపీ ప్రభుత్వానికి  షాక్ ల పై షాక్ లు తగులుతున్నాయి. తాజాగా జగన్ సర్కార్ కు ఎన్జీటీ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్‌జీటీలో ఇవాళ విచారణ జరిగింది. పనులను నిలిపివేయాలని ఎన్‌జీటీ గతంలో తీర్పు ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ వాసి గరిమళ్ల శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ విచారించిన ఎన్జీటీ.. ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తీర్పును ధిక్కరించి పనులు కొనసాగిస్తే.. చీఫ్‌ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరించింది. పనులను నిలిపివేసి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశామని ఎన్‌జీటీకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వ వాదనలపై అనుమానాలు వ్యక్తం చేసింది ఎన్‌జీటీ. రాయలసీమ పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని.. కేఆర్‌ఎంబీ, పర్యావరణ శాఖలకు ఎన్‌జీటీ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.

    గతంలోనూ ఇదే అంశంపై పలుసార్లు ఏపీకి మొట్టికాయలు వేసింది. పర్యావరణానికి హాని కలిగించేలా ఉన్న ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్ ఆశ్రయించారు. పిటిషనర్ ఆధారంగా ప్రభుత్వం తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ఇదే పరిస్థితి కొనసాగితే చీఫ్ సెక్రటరీని తప్పక జైలుకు పంపించాల్సి వస్తుందని హెచ్చరించింది ఎన్జీటి..

    : వైఎస్ నరరూప రాక్షసుడు.. పీజేఆర్ మృతికి కారణం కాదా? మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఏపీ కి ఎన్జీటీ వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ప్రాజెక్టు కోసం పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలోనే స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దని ఆదేశించింది. ఇక డీపీఆర్‌కు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టకూడదని కేంద్ర జలశక్తి శాఖ ఎన్జీటికి తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ కీలక తీర్పు ఇచ్చింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు తరలించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో అక్రమంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.

    : : ఆ కీలక నేతను సీఎం జగన్ ఎందుకు దూరం పెడుతున్నారు..? వ్యహారం అక్కడే చెడిందా?

    ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై  సుప్రీం కోర్టులో కేసు కూడా ఉంది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సమైక్య రాష్ట్రంలోనే నదుల నీటివాటాలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని తన పిటిషన్‌లో పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ప్రస్తావించింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు, టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తూ తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించింది.
    Published by:Nagesh Paina
    First published: